మంత్రి చందూలాల్‌ను అడ్డుకుంటున్న గీత కార్మికులు
-
తమకు ప్రత్యామ్నాయం చూపాలని అడ్డుకున్న గీతకార్మికులు
-
నిరసనల మధ్యనే శంకుస్థాపన చేసిన మంత్రి చందూలాల్
జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్ శంకుస్థాపన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. రిజర్వాయర్ వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు ప్రారంభించవద్దంటూ గీత కార్మికులు అడ్డుతగిలారు. ఒకవైపు గీత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు.
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఉప్పుగల్లు గ్రామాన్ని ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణ వల్ల ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములతో పాటు గీత కార్మికుల తాటి చెట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే ముంపునకు గురయ్యే భూములపై సర్వే నిర్వహించడంతో పాటు భూములు కోల్పోయే కొంతమంది రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అయితే తాటిచెట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.
ఈ విషయం తేలకుండానే ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న గీత కార్మికులు పెద్ద సంఖ్యలో మోకు ముత్తాదులతో శిలఫలకం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. తాటి చెట్ల వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే పనులకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయకుండా అడ్డుతగిలారు. వారిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా గీత కార్మికులతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా గీతకార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఒక ఒక వైపు గీతా కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తుండగానే మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. సభ జరగకుండా పలుమార్లు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా బైటకు పంపించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఇదే గ్రామస్తుడైన వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ రిజర్వాయర్ వల్ల నష్టపోతున్న గీత కార్మికులను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు.