టెన్షన్.. టెన్షన్!
- నేటి నుంచి కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష
- తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసు నిషేధాజ్ఞలు
- టీడీపీ నేతల చర్చలు విఫలం
- గురువారం అర్ధరాత్రి వరకూ భేటీ..డిమాండ్లపై లభించని హామీలు
కాకినాడ : ముద్రగడ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దీక్ష చేయడం ఖాయమని తేలిపోయింది. జనవరి 31వ తేదీన కాపు ఐక్యగర్జన సందర్భంగా విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోవడం, గతంలో ముద్రగడ దీక్షల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను సిద్ధం చేశారు. ఏ క్షణంలో ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా పోలీసులను సన్నద్ధం చేశారు. మరోవైపు పోలీసు ఆంక్షలు విధించడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో నిషేధాజ్ఞలు ప్రస్తుతం ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా మొత్తం మీద సీఆర్‌పీసీ 144 సెక్షన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. జనం గుంపులు గుంపులుగా తిరగడం, సమావేశం కావడం నిషేధం. పోలీసుచట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధిస్తున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాశ్ వెల్లడించారు. జనవరి 31న జరిగిన తుని విధ్వంసకాండ దృష్ట్యా బయటి ప్రాంతాల నుంచి ఎవరూ తూర్పు గోదావరి జిల్లాకు రావద్దని, ముఖ్యంగా యువకులు పోలీసు నిషేధాజ్ఞలను గమనంలోకి తీసుకోవాలని సూచించారు.
అయితే సాధారణ ప్రజలు, పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది ఉండదని ఎస్పీ భరోసా ఇచ్చారు. సాధ్యమైనంత వరకూ కిర్లంపూడి రాకుండా ఉండటమే శ్రేయస్కరమని ప్రజలకు హితవు పలికారు. అయితే గ్రామాల్లో శాంతియుతంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. ప్రదర్శనల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గత సంఘటనల నేపథ్యంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఎస్పీ వెల్లడించారు.
భారీగా బలగాల మోహరింపు..
కాపులను బీసీల్లో చేర్చడం, కాపు కార్పొరేషన్‌కు రూ.1900 కోట్లు విడుదల చేయడం, ‘గర్జన’ నేపథ్యంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పద్మనాభం నిరాహార దీక్ష దృష్ట్యా జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. సంఘ విద్రోహశక్తులను ఎక్కడికక్కడ గుర్తించి అడ్డుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 39 చెక్‌పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. కాపుగర్జన సభ తదుపరి విధ్వంసానికి పెట్రోల్, మారణాయుధాలు తెచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
మరోవైపు 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్, ఐటీబీఎఫ్ బలగాలు జిల్లాకు వచ్చాయి. నాలుగు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీసుశాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని అదనంగా జిల్లాకు రప్పిస్తున్నారు. జిల్లాకు వచ్చే యాత్రికులు, సాధారణ ప్రజల వద్దనున్న గుర్తింపుకార్డుల ద్వారా అనుమతి ఇస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఐజీ, డీఐజీ
కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌ను ఐజీ కుమార్ విశ్వజిత్, డీఐజీ హరికుమార్ గురువారం ఉదయం సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు పోలీసులతో మాట్లాడి వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది.