టెన్షన్.. టెన్షన్
టెన్షన్.. టెన్షన్
Published Tue, Oct 4 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
* మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి
* విజయవాడ, గుంటూరు నగరాల్లో సర్వే
* 25 శాతం మందికి ఇదే ప్రధాన సమస్య
* ప్రాథమిక దశలో గుర్తిస్తే మంచిదంటున్న వైద్యనిపుణులు
* నేటి నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు
తెల్లారి లేస్తే అంతా ఉరుకులు పరుగులే... జీవనశైలి మారిపోయింది. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి..? ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
గుంటూరు డెస్క్: విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధానిగా అభివృద్ధి చెందడంతో మానసిక వత్తిళ్లు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఇటీవల ఓ సంస్థ రెండు నగరాల్లో 1250 మందిని సర్వే నిర్వహించగా, ప్రతి నలుగురులో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యకు గురవుతున్నట్లు తేలింది. అంటే 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. 22–29 సంవత్సరాల మధ్య వయస్సు వారు 55 శాతం మంది వత్తిళ్లకు గురవుతుండగా, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు 42.5 శాతం మంది మానసిక వత్తిళ్లకు గురవుతున్నట్లు తేలింది.
వ్యాధులకు మూలం ఒత్తిళ్లు..
వ్యక్తులు సమర్థులైన, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలంటే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ అయిపోతున్న ఆధునిక జీవనశైలిలో గుండెజబ్బు, మధుమేహం, అల్సర్లు వంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్లలోపు పిల్లల నుంచి కళాశాల విద్యార్థుల వరకు, అలాగే ఉద్యోగులు, గృహిణిలు, వ్యాపారస్తులు, సేవా రంగంలో ఉన్న వారు తమ రోజువారీ జీవితాల్లో తీవ్రమైన మానసిక వత్తిడికి, శ్రమకు గురవుతున్నారు. గ్రామీణుల కంటే పట్టణ వాసులే ఎక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు.
మానసిక ప్రథమ చికిత్స... ఈ ఏడాది నినాదం
సమాజంలో రోజు రోజుకు మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారి సంఖ్య పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా అక్టోబరు 4 నుంచి 10 వరకూ మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతిఏటా ఒక నినాదంతో ముందుకెళ్తుండగా, ఈ ఏడాది మానసిక ప్ర«థమ చికిత్స (సైకాలజిక్ ఫస్ట్ ఎయిడ్) అనే థీమ్‌తో అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలు, వైద్య సంఘాలు మానసిక ఆరోగ్యంపై వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు..
ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యం అందుబాటులో ఉంది. సమస్య తీవ్రతరం కాకుండా ప్రాథమిక దశలో గుర్తించి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే కౌన్సెలింగ్‌తో పాటు, మందుల ద్వారా నయం చేయవచ్చు.
– డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు
యుక్త వయస్సు వారిలో ఎక్కువ సమస్యలు..
యుక్త వయస్సులో ఉన్న వారే ఎక్కువగా మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. పెళ్లైన∙కొత్తలో భార్యాభర్తల మధ్య సర్దుబాటు సమస్యలు, ఇద్దరూ వేర్వేరు ఆలోచనలు కలిగి ఉండటం అందుకు కారణంగా నిలుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో విడాకుల వరకూ దారితీస్తుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్‌తో కూడా మా వద్దకు వస్తున్నారు. అటువంటి వారికి కౌన్సెలింగ్ ద్వారా వత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేలా చేయవచ్చు. విద్యార్థుల్లో వత్తిడితో కూడుకున్న సమస్యలు పెరిగిపోయాయి. వారిని ఈ సమస్య నుంచి కాపాడుకోవాలి.
– డాక్టర్ టీఎస్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్ అసోసియేషన్
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడమే
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడమే మానసిక వత్తిళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రోజులో ఇద్దరు కలిసి అర్ధగంట కూడా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. పిల్లలతో కలిసి ఉండే సమయం కూడా చాలా తక్కువే. దీంతో వత్తిళ్ల నుంచి ఉపశమనం లభించడం లేదు. ఒకప్పుడు ఇంట్లోని అమ్మమ్మ, తాతయ్యలు తమ ఓదార్పు ద్వారా వత్తిడిని పోగోట్టేవారు. ఇప్పుడు అలాంటి వారు లేక పోవడంతో కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
– డాక్టర్ గర్రే శంకరరావు, ఉపాధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్స్ అసోసియేషన్
Advertisement
Advertisement