
మా పెంపుడు కుక్క 12 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయింది. మాకు పిల్లలు లేని కారణంగా, కుక్కతో మాకు చాలా అటాచ్ మెంట్ ఉండేది. నాకు బాధగా ఉన్నప్పటికీ, మా ఆయన మరీ డీలా పడిపోయారు! రోజు దానిని నడకకు తీసుకెళ్ళడం, రాత్రి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, ఆయన ఎంతో శ్రద్ధతో చేసేవారు. అది చనిపోయిన తరువాత ఆయన బాగా డల్ అయి మాటలు కూడా తగ్గాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటున్నారు. రాత్రులు నిద్ర పట్టక గంటల తరబడి అటు ఇటు తిరుగుతున్నారు. బిజినెస్ మీద కూడా ముందున్న శ్రద్ధ పెట్టడం లేదు నా భర్తను కోల్పోతున్నానని, భయమేస్తోంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.
– మంజుశ్రీ, విశాఖ పట్టణం
మీ ఉత్తరంలో మీ భర్త ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక వేదన స్పష్టంగా కనిపిస్తోంది. 12 సంవత్సరాలుగా అంతప్రేమగా పెంచుకున్న పెట్‌ని కోల్పోవడం మీ ఇద్దరికీ ఎంత బాధాకరమో నేను ఊహించగలను. దానికి రోజూ మార్నింగ్ స్నాక్స్, రాత్రి భోజనం, స్నానం వంటి రోజు వారికి కార్యాలు చేయించడం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా అయినట్లు అనిపిస్తుంది. ఆయన మనోవేదన, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత తీవ్రంగా ఉన్నట్లుంది. పెంపుడు జంతువులు అందునా ముఖ్యంగా కుక్కలు, మన భావోద్వేగ జీవితంలో ఒక అంతర్భాగం అవుతాయి. అవి నిష్కపటమైన ప్రేమను పంచుతాయి.
మీ భర్త ఒంటరితనం, నిద్రలేమి, పనిలో ఇబ్బందులు చూస్తే ఆయన ‘కాంప్లికేటెడ్ గ్రాఫ్’ అనే మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని అనిపిస్తుంది. మార్నింగ్ వాక్, కుక్కకు రాత్రి భోజనం పెట్టడం వంటిని ఆయనకు ఒక నిర్దిష్టమైన రొటీన్‌ను అందించాయి. అవి లేకపోవడం, వల్ల అతని దైనందిన జీవితంలో ఒక శూన్యత ఏర్పడినట్లుంది. కొన్నిసార్లు కుక్క చనిపోయినప్పుడు దాన్ని బతికించుకోలేక పోయాననే గిఫ్ట్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు! మన సమాజం పురుషులను తమ దుఃఖాన్ని బయటకు వెలిబుచ్చకుండా మనసుల్లో దాచుకొనేందుకు ఒత్తిడి చేస్తుంది.
ఇది కూడా ఆయన ప్రస్తుత ప్రవర్తనకు ఒక కారణం కావచ్చు. ఆయన పడుతున్న వేదనను మీరు అర్థం చేసుకొని ‘నేను నీకోసం నీతోనే ఉన్నాను’ అనే విషయాన్ని ఆయనకు అర్థం అయేలా వ్యక్తం చేయండి. ఇది అతను ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఇస్తుంది. మీ కుక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటడం లేదా ఫోటో ఆల్బమ్ తయారు చేయడం లాంటిని ఆయనతో చేయించండి. ఆయన రొటీన్‌ను కొనసాగించడానికి, ఉదయం నడకకు కలిసి వెళ్దామని సూచించండి.
ఆయన నిద్రలేమి ఒంటరితనం, పనిలో ఇబ్బందులు కొనసాగితే ఒక సైకియాట్రిస్ట్‌కి చూపించి కౌన్సెలింగ్, ఇంకా అవసరం అయితే కొన్ని మందులు, వాడించండి. మీ కుక్కకు సంబంధించిన మంచి జ్ఞాపకాలు పంచుకోండి. మీ ప్రేమ, సాంగత్యం అతనికి శక్తిమంతమైన సపోర్ట్‌గా ఉంటాయి. మీరు ఆత్మస్థైర్యంతో ఈ పరిస్థితిని తప్పకుండా – అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com )