తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేని వారికి దిక్కు చూపిస్తున్న చుక్కలు కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
హుజూర్‌నగర్ (నల్లగొండ): తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేని వారికి దిక్కు చూపిస్తున్న చుక్కలు కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాధనకు సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుంది. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఎల్లప్పుడూ సీపీఎం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య దొరల పాలన సాగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు.
పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ నిరాకరించారన్నారు. ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకనే అధికార బలంతో ఎదురు దాడికి దిగారన్నారు. నియంతల్లా వ్యవహరించిన వారు కాలగర్భంలో కలసి పోయారని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా అన్నారు.