అమ్మా థ్యాంక్స్ !
అమ్మా థ్యాంక్స్ !
Published Mon, Apr 17 2017 9:34 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
నన్ను చంపనందుకు..
‘అమ్మా.. నీకు ఏ కష్టమొచ్చిందో తెలియదు.. పెళ్లి కాకుండానే నన్ను కన్నావో.. కఠినాత్ముడైన నాన్నను పరిచయం చేయలేకనో.. ఆడపిల్లననే కారణమో.. మరో సమస్యనో తెలియదు.. కన్న పేగు బంధాన్ని తెంచుకోవాలనుకున్నావు. బొడ్డు పేగు కూడా ఆరకుండానే నన్ను వదిలించుకున్నావు. కొందరు తల్లులా ప్రాణం తీయకుండా అందరికీ కనిపించేలా ముళ్ల కంపల మధ్య వదిలేసి వెళ్లావు. థ్యాంక్స్ అమ్మా.. ఈ లోకాన్ని చూపినందుకు.. నన్ను చంపనందుకు. నేను ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నాను.. నీవు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను’. అంటూ ఓ నవజాత శిశువు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆదోని పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మిగనూరు బైసాప్ రోడ్డులో ముళ్ల కంపల మధ్య అప్పుడే కళ్లు తెరిచిన పసికందను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న తులసి అనే మహిళ పసికందు ఏడుపు వినిపించి దగ్గరికి వెళ్లి చూసింది. స్థానికులకు సమాచారం అందించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నిసా బేగం, సూపర్‌వైజర్లు అంజినమ్మ, ఆశీర్వాదమ్మ ఆసుపత్రికి వెళ్లి పసికందు పరిస్థితిని తెలుసుకున్నారు. ఆడపిల్ల కావడంతోనే ముళ్ల కంపల్లో పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు చిన్నారికి చికిత్సలు చేయడంతో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీడీపీఓ తెలిపారు. కర్నూలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.
- ఆదోని అగ్రికల్చర్
Advertisement