దౌర్జన్యకాండ
దౌర్జన్యకాండ
Published Thu, Oct 27 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
- ఆలూరులో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు
- మాటవినని అధికారులపై వేధింపులు
- పోలీసుల అండతో సామాన్యులపైనా జులుం
- తాజాగా ఒకరైతు ఆత్మహత్యాయత్నం
- సూసైడ్ లేఖలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరు
ఆలూరు రూరల్: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేసుకోలేరనే ధైర్యంతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారులను వేధించడమే కాకుండా సామాన్యులపై కూడా తమ ప్రతాపం చూపుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో వీరి ఆగడాలు మితిమీరి పోయాయి. ఇటీవల ఓ రైతు ఆత్మహత్యకు యత్నించి..ఇందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్, హాలహర్వి ఎస్‌ఐ కృష్ణమూర్తి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసుల అండతో టీడీపీ నేతలు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో ఈ ఘటన ఓ ఉదాహరణ.
జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరందరూ ఎన్నికల్లో తమకు నచ్చిన నేతలకు ఓట్లు వేస్తున్నారు. ఆ తర్వాత ఎవరి పనులు వారివే. అయితే ఇటీవల హాలహర్వి మండలం మాచనూరులో మొహర్రం ముగింపు వేడుకల్లో సొంత బంధువులు వర్గాలుగా విడిపోయి చిన్న ఘర్షణకు దిగారు. గతంలో తమపార్టీకి ఓట్లు వేయలేదన్న అక్కసుతో ఆ ఘర్షణకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పూశారు. హాలహర్వి ఎస్‌ఐతో మాచనూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు మీసాలు గీకి, గుండు కొట్టించారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన అదే మండలంలో చోటు చేసుకుంది. కుర్లేహళ్లి గ్రామంలో రైతు శంబులింగ గ్రామంలోని వీరభద్రస్వామి మాన్యంభూమి (సర్వేనం. 50/బీ, 2.43 ఎకరాలు)ని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమి అదే గ్రామంలో వీరభద్రస్వామి ఆలయ పూజారి ఉమాపతి స్వామికి ఇప్పించాలని టీడీపీ నేతలు ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. జీవనోపాధి కోల్పోతానని శంబులింగ పదేపదే టీడీపీ నేతలను కోరినా పట్టించుకోలేదు. దీంతో శంబులింగ కోర్టుకు వెళ్లాడు. దీనిని జీర్ణియించుకోలేని అధికార పార్టీ నేతలు హాలహర్వి ఎస్‌ఐ కృష్ణమూర్తిని వాడుకున్నారు. ఆయన రైతును ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో రైతు శంబులింగ పురుగుమందు తాగాడు. అంతకముందు తన చావుకు ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్, హాలహర్వి ఎస్‌ఐ కృష్ణమూర్తి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తహసీల్దార్లపై వేధింపులు..
గతంలో ఆలూరులో పనిచేసిన తహశీల్దార్ అన్వర్‌ఉసేన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి.. వివాదంలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఇప్పించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఎలా ఇచ్చారని బాధితుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్‌అవగా..తహసీల్దార్ కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లిపోయారు. గతంలో ఆస్పరి తహసీల్దార్‌గా పనిచేసిన ఆంజనేయులు కర్నూలు ఎంపీ బుట్టా రేణుకమ్మతో కలిసి హలిగేర గ్రామంలో రైతు ఓబయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాడు. ఆ విషయాన్ని జీర్ణియించుకోలేని అధికార పార్టీ నేతలు తహసీల్దార్ తమ మాట వినడంలేదని వేధింపులకు గురిచేసి.. 15 రోజుల్లోనే బదిలీ చేయించారు.
ఇసుక మాఫియా వారిదే..
నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు..ఇసుక మాఫియా నడుపుతున్నారు. హొళగుంద, హాలహర్వి, ఆస్పరి మండలాల్లో ఉన్న పెద్ద వాగులు, వంకలు హంద్రీ తీరాల నుంచి ఇసుకను అక్రమంగా తమ అనుచరుల ద్వారా తరలిస్తున్నారు. ఆస్పరి, ఆలూరు మండలాల్లో ఏర్పాటవుతున్న గాలిమరల (పవన విద్యుత్) కాంట్రాక్టర్లకు ఇసుకను అక్రమంగా రవాణా చేయిస్తున్నారు. వీరి వ్యవహార శైలిపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement