- ముగ్గరు మహిళల అరెస్ట్
- బాధితురాలి పరిస్థితి విషమం
- గుంటూరు ఆస్పత్రికి తరలింపు
చీరాల క్రైమ్ (ప్రకాశం జిల్లా)
ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఒక మహిళపై ముగ్గరు మహిళలు సిరంజితో దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. తీవ్రంగా గాయపడిన మహిళను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీరాలకు చెందిన ఇలియాస్ అనే వ్యక్తికి చీరాల, గుంటూరులలో చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఇలియాస్‌కు గుంటూరులో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపధ్యంలో భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఇలియాస్ పథకం వేశాడు.
గుంటూరుకు చెందిన ముగ్గురు మహిళలను చీరాలకు రప్పించాడు. బురఖాలు వేసుకున్న ముగ్గరు మహిళలు తాము మతం గురించి బోధించేదుకు వచ్చామని చెప్పడంతో ఇలియాస్ భార్య షేక్ హసీనా వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లిన వారు ఆమెను బిగబట్టి మెడపై సూదితో గుచ్చారు. సిరంజిలో బంగారం శుద్ధిచేసేందుకు వాడే రసాయనాన్ని నింపినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హసీనా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ముగ్గురు మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హసీనా పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలియాస్ పరారీలో ఉన్నాడు. భార్యను తొలగించుకోవాలనే తలంపుతోనే ఇలియాస్ ఈ దాడి చేయించినట్లు డీఎస్పీ జైరామరాజు విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
చీరాలలో మహిళపై సిరంజితో దాడి
Published Tue, Apr 26 2016 7:46 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement