నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని చెరువులో గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను ఆదివారం గుర్తించారు. పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది మత్స్యకారులు శనివారం సాయంత్రం గ్రామం సమీపంలోని చెరువులో వలలు వేయడానికి వెళ్లారు. చేపల వేటకు వీలుగా నీటిలో వలలు విడిచి తిరిగి రాగా, ముగ్గురు మాత్రం తెప్ప తిరగబడడంతో గల్లంతయ్యారు. వారిలో అంబటి వెంకన్న మృతదేహం రాత్రి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. వడ్డి సోమయ్య (50), నాగయ్య (22) మృతదేహాలను ఆదివారం ఉదయం గాలింపు చర్యల్లో భాగంగా గుర్తించారు.
ఇక్కడి చెరువు భారీ విస్తీర్ణంలో ఉంటుంది. భారీ ఈదురు గాలులకు చెరువు మధ్య భాగంలో తెప్ప తిరగబడడం వల్ల అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడ్డుకు ఈదుకుంటూ రాలేకపోయి ఉంటారని తోటి మత్స్యకారులు అంటున్నారు. కాగా, ప్రమాదం జరిగిన చెరువును జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు. ఆర్డీవో, డీఎస్పీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల సాయం అందించే కృషి చేస్తామన్నారు.
గల్లంతైన మత్స్యకారుల మృతదేహాల గుర్తింపు
Published Sun, May 29 2016 10:37 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement