కానిస్టేబుల్ దారుణహత్య | The brutal murder of Constable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ దారుణహత్య

Published Tue, Oct 27 2015 3:44 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

కానిస్టేబుల్ దారుణహత్య - Sakshi

కానిస్టేబుల్ దారుణహత్య

♦ భార్యపైనే అనుమానాలు
♦ పోలీసుల అదుపులో నిందితురాలు
 
 గజ్వేల్: ఓ పోలీసు కానిస్టేబుల్‌ను పట్టపగలు దారుణంగా హత్య చేశారు. మెడ నరికి అతి కిరాతంగా నరికి చంపారు. అతని భార్యే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం.. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన మిద్దె నర్సింహులు (40) సర్కిల్ పరిధిలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గజ్వేల్‌లోని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలో సొంత ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. ఇతనికి రామాయంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాల లక్ష్మితో రెండో వివాహమైంది.

దంపతుల మధ్య స్పర్థలు రావడంతో ఇటీవల వారు విడిపోయారు. ఈ క్రమంలో గొడవలు జరగగా, బాలలక్ష్మి ఫిర్యాదుతో నర్సింహులుపై కేసు కూడా నమోదైంది. కాగా, నర్సింహులు ఇంటిని అమ్ముకుంటున్నాడనే సమాచారంతో బాలలక్ష్మి.. తన ముగ్గురు కూతుళ్లు, తల్లిదండ్రులతో కలసి ఇంటికి వచ్చింది. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడుతున్న వారిని నర్సింహులు అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది.

ఈ నేపథ్యంలో నర్సింహులు దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం ఇంటికి పది గజాల దూరంలో రోడ్డుపై పడి ఉంది. ఘర్షణలో బాలలక్ష్మి తండ్రి రాములుకు సైతం కత్తిపోట్లు అయ్యాయి. దీంతో అతన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనానంతరం బాలలక్ష్మి పోలీసులకు లొంగిపోయింది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement