వదిలితే ఒట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తూప్రాన్ పీఎస్..! ఇదో హాట్‌కేక్. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి ఇక్కడ పోస్టింగ్ వస్తేచాలు.. ఇక దాన్ని ఒదిలితే ఒట్టు. కానిస్టేబుల్ నుంచి మోతెమీన్ వరకు సార్లు ఎవరు వచ్చినా గబ్బిలమైపోతున్నారు. ఏడాది.. రెండేళ్లు... ఐదేళ్లు...ఇలా క్యాలెండర్లు ఎన్నిమారినా ఇక్కడి సార్లకు మాత్రం బదిలీలు ఉండవు. ఒక వేళ బలవంతంగా గెంటేసినా.... ఏలికలకు బురిడీకొట్టి మళ్లీ ఇక్కడికే వస్తారు. ఇక్కడ సర్కిల్ సాబ్‌గా.. మోతెమీన్‌గా ఐదేళ్లు పని చేసిన ఓ అధికారి ఏరికోరి పట్టుబట్టి మళ్లీ ఇక్కడే పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఇంతకూ తూప్రాన్ పీఎస్ స్పెష్పాలిటీ ఏమిటి..? ఖాకీలంతా ఇక్కడే తిష్టవేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు...? మనమూ ఓ సారి తెలుసుకుందాం...
ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటో.. రెండో ఆదాయ మార్గాలుంటాయన్న విషయం జగమెగిరిన సత్యం. ఇసుక దందా, మద్యం, కల్లు వ్యాపారం ‘మామూళ్లే’. కానీ ఏ ఠాణాకు లేని ఆదాయం ఇక్కడుంది. తూప్రాన్‌కు ఆదాయం తుఫాన్‌లా వస్తుందట. ఇక్కడ పట్టుకున్నదల్లా బంగారమేనట. ఇసుక ఫిల్టర్లు, కంకర మిషన్లు, 44వ జాతీయ రహదారి, దాబాలు, హోటళ్ల నుంచి మామూళ్లు, చిట్టి వ్యాపారులు, రోజువారీ ఫైనాన్స్, మార్వాడీ దుకాణాలు, కల్లు దుకాణాలు, వైన్స్‌లు, పరిశ్రమలు తదితర వ్యాపారుల నుంచి కూడా క్రమం తప్పకుండా మామూళ్లు అందుతాయి. దీంతో ఇక్కడున్న పెద్దసారు ప్రతి విభాగానికి ఒక ప్రత్యేక కానిస్టేబుల్‌ను పెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు.
ఇక హైదరాబాద్‌కు 40 కిలోమీటర్లు దూరంలోనే తూప్రాన్ ఉండడంతో ఇక్కడ రహదారికి సమీపంలో ఉన్న భూములకు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. దీంతో భూముల మీద కొద్దిగా కిరికిరి ఉన్నా సరే... మోతెమీన్ సారే మోతెవారై తీర్పు చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. సివిల్ విషయాల్లో తలదూర్చవద్దని కోర్టులు అనేకసార్లు హెచ్చరించినా.. మన వాళ్లు మాత్రం వాటినే పట్టుకుంటున్నారు.
ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని ఇరువర్గాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పెద్దసారుకు నెలకు కనీసంగా రూ. 5 నుంచి రూ. 8 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లు సమాచారం. ప్రతి పోలీసు స్టేషన్ నుంచి రూ.30 వేల చొప్పున నెలవారీ రెగ్యులర్ మామూళ్లు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే తూప్రాన్ పీఎస్‌లో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు దోచుకున్నవారికి దోచుకున్నంత. ఆదాయం బాగా ఉండటంతో పోలీసులు ఇక్కడి నుంచి కదలటానికి ఇష్టపడనట్లు సమాచారం.
తూప్రాన్ పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి గతంలో తూప్రాన్‌లో సీఐగా, డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఆయన 2001 ఆగస్టు 01 నుంచి 2004 ఆగస్టు 22 వరకు సీఐగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2010 నవంబరు నుంచి 2011 నవంబరు వరకు ఇక్కడే డీఎస్పీగా పనిచేశారు. పోలీసుశాఖలో ఒకసారి పోస్టింగ్ ఇచ్చిన స్టేషన్‌కు మరోసారి పంపరు. కానీ సదరు డీఎస్పీకి 2014 అక్టోబర్‌లో తూప్రాన్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై పోలీసు వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలోనే రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఏఎస్‌ఐ 22 ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌గా వచ్చిన ఆయన, ఇప్పుడు ఏఎస్‌ఐ అయ్యారు. వాస్తవానికి రామాయంపేట పీఎస్‌లో విధులు నిర్వర్తించాల్సిన ఆయన, తూప్రాన్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ సార్ సీనియార్టీని చూసి కొత్తగా వచ్చిన సీఐలే వణికిపోతారట.
తూప్రాన్ సీఐ కార్యాలయంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ 15 ఏళ్ల నుంచి పాతుకుపోయారు. సారు వాస్తవంగా వెల్దుర్తి పీఎస్‌లో డ్యూటీ చేయాల్సి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లరు గాక వెళ్లరు. సీఐ రైటర్‌గా తూప్రాన్‌లో పనులు చక్కబెడుతున్నారు. ఇక్కడే ఇంకో రైటర్ సారు కూడా ఏనిమిది ఏళ్లుగా తిష్టవేసి కూర్చుకున్నారు.
కానిస్టేబుల్‌గా వచ్చి హెడ్‌కానిస్టేబుల్.. ఏఎస్‌ఐగా పదోన్నతి పొంది ఇంకా కొనసాగుతున్నవారు, ఐదేళ్లకు పైగా ఇక్కడే పాతుకపోయిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి అధికారుల వరకు 6 మంది ఉన్నారు. వీళ్లందరి సీనియార్టీకి తగినట్టుగా ఇక్కడికొచ్చే అధికారులు ‘బాధ్యతలు’ అప్పగిస్తున్నారు.
ఏడాది కిందట ఇదే పోలీసు స్టేషన్లలో ఓ ‘ఖాకీ’ ఏకంగా తుపాకీ ఎత్తుకొనిపోయి గుర్తు తెలియని చోట దాచిపెట్టారు. అప్పట్లో ఆ సంఘటన జిల్లాలో సంచలనమైంది. రాబడి పంపకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన సదరు ఖాకీ ఠాణా ఆయుధగారం నుంచి లోడెడ్ తుపాకీ ఎత్తుకొనిపోనట్లు అప్పట్లో గుప్పుమంది. అక్రమ వసూళ్ల వివరాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లేందుకే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారులు సదరు ఖాకీని బతిమలాడుకొని తుపాకీ తెప్పించుకున్నారు. చివరకు కనిపించకుండా పోయిన తుపాకీ పోలీసు స్టేషన్‌లోని మూత్రశాల వెనుక చెత్తలో గుర్తించారు. విచారణలో మాత్రం ఏదో కట్టుకథ అల్లి నివేదికను జిల్లా ఎస్పీకి పంపి వాస్తవాన్ని దాచిపెట్టినట్లు సమాచారం.