మైనారిటీలకు ప్రత్యేక గురుకులాలు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు
♦ తొలి విడతగా వచ్చే ఏడాది నుంచి 60 గురుకుల స్కూళ్లు
♦ మరోచోటకు చంచల్‌గూడ జైలు, రేసు కోర్సు తరలింపు
♦ ఆ స్థలాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణం
♦ గురుకుల స్కూళ్లలో ఐచ్ఛిక భాషగా ఉర్దూకు అవకాశం
♦ మైనారిటీ హ్యాకర్లు, వెండర్లకు ప్రత్యేక పథకం
♦ మైనారిటీల సంక్షేమంపై సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పా టు చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మైనారిటీల సంక్షేమంపై సూచనల కమిటీ అధ్యక్షుడు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసై టీ డెరైక్టర్ ప్రవీణ్ కుమార్‌తో కలసి శనివారం సచివాలయంలో మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12% ఉన్న ముస్లిం లు, మరో 2 శాతం ఉన్న ఇతర మైనారిటీలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారి జీవన ప్రమాణాల్లో మెరుగైన మార్పులు రావాలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లింలలో అక్షరాస్యత తక్కువగా ఉందని, పాఠశాలల్లో డ్రాపవుట్ అవుతున్న మైనారిటీ విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉందన్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీల్లో చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు 100% విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు రూపొం దించాలన్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకునైనా సరే మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తొలి విడతగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలుర కోసం 30, బాలికల కోసం 30 చొప్పున 60 మైనారిటీ గురుకుల పాఠశాలల ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ స్కూళ్లకు అవసరమయ్యే 2,100 మంది సిబ్బందిని నియమించుకోవాలని, జూన్‌లోగా వారికి శిక్షణ కూడా ఇవ్వాలని మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను సీఎం ఆదేశించా రు. మొదటి ఏడాది అద్దె భవనాల్లో పాఠశాలలను నడపాలని, రెండో ఏడాదికల్లా సొంత భవనాలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌లో గణనీయంగా సంఖ్యలో ఉన్న మైనారిటీ బాలబాలికల కోసం గురుకుల పాఠశాలల నిర్మాణానికి చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సు స్థలాలను వినియోగించాలని, వాటిని మరోచోటుకు తరలించాలన్నారు. రాష్ట్రంలో తెలుగుతోపాటు ఉర్దూను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని... అందుకే మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ఉర్దూను ఐచ్ఛిక భాష (ఆప్షనల్ లాంగ్వేజీ)గా ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు.
అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రస్తుతం నడుస్తున్న ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగానే ఉంటాయన్నారు. మైనారిటీ యువకుల కోసం ఆర్థికంగా చేయూత అందించే పథకాలను తీసుకురావాలని సూచించారు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుని ఆర్థికంగా చితికిపోతున్న మైనారిటీ హ్యాకర్లు, వెండర్లకు ప్రభుత్వం నుంచే ఆర్థిక సాయం అందేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ సమీక్షలో మైనారిటీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ షఫియుల్లా, సీఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.