మైనారిటీలకు ప్రత్యేక నిధి | Special fund for minorities sayes kcr | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు ప్రత్యేక నిధి

Published Mon, Feb 29 2016 2:28 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మైనారిటీలకు ప్రత్యేక నిధి - Sakshi

మైనారిటీలకు ప్రత్యేక నిధి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
♦ ముస్లిం నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
♦ మార్చి 31లోగా ఫీజు రీయింబర్స్‌మెంట్
♦ మైనారిటీల సంక్షేమంపై సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: మైనారిటీ సంక్షేమానికి అవసరమైతే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) నుంచి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌లో రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలకు, ముస్లిం యువత స్వయం ఉపాధికి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సమప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన కులాలు, దళితులకు, మహిళలకు అమలవుతున్న విధంగానే మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలుకావాలని సీఎం అన్నారు.

మైనారిటీల సంక్షేమ పథకాల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సమీక్ష జరిపారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, న్యాయ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. షాదీ ముబారక్ పథకంతో సహా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉపాధి శిక్షణ, ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర పథకాలన్నీ ముస్లిం లబ్ధిదారులకు అందాలన్నారు. ఇప్పటివరకు 26,635 మంది షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకంలో కొన్ని లోపాలు సీఎం దృష్టికి రావడంతో పేద ముస్లిం యువతకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టించే బ్రోకర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అర్హులైన ముస్లిం పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తామన్నారు.

 మైనారిటీ అంటే నిర్లక్ష్యం వద్దు
 ‘మైనారిటీ అంటేనే నిర్లక్ష్య ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. మైనారిటీల సంక్షేమాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఎన్ని నిధులు ఖర్చయినా మైనారిటీల పథకాలన్నీ అవాంతరాల్లేకుండా కొనసాగించాలి’ అని సీఎం స్పష్టం చేశారు. ముస్లిం యువతకు అవకాశం దొరికితే అద్భుతమైన ప్రయోజకులుగా మారుతారన్నారు. ఇంజనీరింగ్, ఉన్నత విద్య, వృత్తి విద్య తదితర రంగాల్లో ప్రభుత్వ ఖర్చుతో ఉన్నతమైన శిక్షణను అందించాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న జూనియర్, డిగ్రీ కాలేజీల భవన నిర్మాణాలు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 వక్ఫ్ భూములకు భద్రత
 ‘జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయిన వక్ఫ్ స్థలాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని జీహెచ్‌ఎంసీ వెంటనే చెల్లించాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుస్సేనీ షావలీ దర్గా, బియా బానీ దర్గా, ఫకీర్ ముల్లా దర్గాలకు చెందిన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా తక్షణమే సర్వే నిర్వహించి బోర్డుకు అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించారు. మక్కా మసీదు పునరుద్ధరణ పనులు రంజాన్ పండుగలోపు పూర్తవుతాయని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మైనారిటీ సంక్షేమంపై విసృ్తత స్థాయి సమీక్ష చేపడతామని చెప్పారు.

 ముస్లిం యువతకు భరోసా
 ‘పోటీ పరీక్షల్లో పాల్గొనే ముస్లిం విద్యార్థులకు తమ మాతృభాష ఉర్దూలో రాసేందుకు అనుమతి ఇవ్వాలి. ఏప్రిల్‌లో చేపట్టబోయే పోలీసు నియామకాల్లో ముస్లిం యువత భాగస్వామ్యం పెరిగే చర్యలు చేపట్టాలి. తగిన శిక్షణను ఇచ్చేందుకు అత్యున్నత నాణ్యత ఉన్న శిక్షణ సంస్థలను గుర్తించి ఖర్చుకు వెనుకాడకుండా కోచింగ్ ఇప్పించాలి’ అని సీఎం కేసీఆర్ మైనారిటీ సంక్షేమ కార్యదర్శి ఉమర్ జలీల్‌ను ఆదేశించారు. ‘ముస్లిం యువత అంటే కేవలం ఎలక్ట్రిక్, మెకానిక్, ప్లంబర్ పనులు చేసే వాళ్లే కాదు.. వాళ్లను గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలన్నదే నా ధ్యేయం. టీఎస్ ఐపాస్ కింద ఐటీ పార్కులను ఏర్పాటు చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలి’ అని అన్నారు.

 ఫీజులు వెంటనే చెల్లింపు
 ‘వచ్చే జూన్ నుంచి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలి. సంబంధిత ఉద్యోగ నియామకాలు తక్షణమే చేపట్టాలి’ అని సీఎం ఆదేశించారు. దారుల్ ఉలూమ్‌లో ఆడిటోరియం నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రతిష్టాత్మక జామై నిజామియా యూనివర్సిటీకి చెందిన కోర్సులకు గుర్తింపును పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి చెప్పారు. మార్చి 31లోపు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నయాపైసా ఉంచుకోకుండా చెల్లించాలని సీఎం ఆదేశించారు.
 
 రూ.2వేల కోట్లకు పెంచండి: అసద్
 మైనార్టీ సంక్షేమానికి కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోవడం లేదని, అందువల్ల నిధులను రూ.2 వేల కోట్లకు పెంచాలని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం ఇచ్చారు. బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ రుణాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్, షాదీముబారక్ పథకాలకు కేటాయింపులు అదనంగా పెంచాలని కోరారు. ప్రస్తుతం సుమారు 97 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు కూడా పెంచాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు అదనంగా రూ.500 కోట్లు పెంచాలన్నారు. మక్కామసీదు మరమ్మతులకు రూ. 1.75 కోట్లు విడుదల చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement