బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ అమలు చేయాలి
- సామాజిక హక్కుల వేదిక నేతలు
అనంతపురం న్యూటౌన్ : బడుగు బలహీన వర్గాల వారి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం పాటుపడాలని సామాజిక హక్కుల వేదిక నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో పలు కుల సంఘాల వారు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. లింగమయ్య సభా«ధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక గౌరవాధ్యక్షులు నాగభూషణం, అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, నాయకులు నదీం అహ్మద్, జాఫర్, తిరుపాల్, దాదా గాంధీ, సాలార్‌బాషా, మాజీ న్యాయమూర్తి క్రిష్టప్ప, కేశవనాయక్, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్ మహ్మద్, ముస్లిం మైనార్టీ నాయకులు హక్, ఖలీలుల్లాఖాన్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల ఐక్యతను వెలుగెత్తి చాటేందుకు తొలిసారి ఐక్యవేదికగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రిజర్వేషన్లకు మంగళం పాడాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని, ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన కులానికో అసెంబ్లీ సీటు కేటాయించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపులు జరగకపోతే సామాజిక హక్కుల వేదిక తరఫున ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామన్నారు. విడివిడిగా పోరాడితే సమస్యలు పరిష్కారం కావన్న ఉద్దేశ్యంతోనే సామాజిక హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని డివిజన్లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారని, ఈ విషయాన్ని పలు కమిషన్లు స్పష్టం చేసినా ఫలితం లేకుండాపోతోందన్నారు. దళితుల కన్నా దరిద్రమైన జీవితాన్ని ముస్లింలు గడుపుతున్నట్లు ముస్లిం నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదని ఆరోపించారు. సీపీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రజల్లో చైతన్యం తేవడం కోసం, తమ హక్కుల సాధన కోసం జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు యాత్ర సాగుతుందన్నారు. అంతకు ముందు పలు కులసంఘాల ప్రతినిధులు తమ సంస్కృతిని చాటే కళారూపాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మీసాల రంగన్న, పాస్టర్ ఐజయ్య, యాదవ సంఘం నరసింహులు, రజక సంఘం ప్రసాద్, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్‌బాషా, ఎంఎండీఏ రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ తదితరులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమస్యలపై మాట్లాడారు.