నిధుల విడుదలలో మమః అనిపిస్తున్నారు!
సాక్షి,సిటీబూరో: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు . మచ్చుకు కొన్ని నిధులను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దూలుపుకోవడంంతో లబ్ధిదారులు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా ఏటా బ్యాంకు లింకేజి సబ్సిడీ రుణాలల్లో భాగంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను హైదారాబాద్– రంగారెడ్డి జిల్లాల్లోని బీసీ కార్పొరేషన్ల పరిధిలో 3,029 యూనిట్లకు రూ.23.42 కోట్లు మంజూరయ్యాయి.
ఇందుకు అధికారయంత్రాంగం ఫిబ్రవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం 820 యూనిట్లకుగాను రూ. 5.87 కోట్లు విడుదల చేసింది. మిగతా 2,209 యూనిట్లకు సంబంధించి రూ. 17.55 కోట్లు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు రెండు వారాలుగా బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో తమకు సబ్సిడి రుణాలు వస్తాయో ..రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
– మిగతా కార్పొరేషన్లు అంతే
ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ సబ్సిడి రుణాల పరిస్థితి అలాగే ఉంది. ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం సగం నిధులు మాత్రమే విడుదల చేయటంతో లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి కల్పనలో భాగంగా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ 1581 యూనిట్లకు గానూ రూ.21 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, 1225 యూనిట్లకు గానూ రూ.17.86 కోట్లు విడుదల చేసింది.
మిగతా 356 యూనిట్లకు గానూ రూ. 3.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు సంబంధించి 73 యూనిట్లకు గానూ 67 యూనిట్లకు మాత్రమే రూ. 1.10 లక్షలు విడుదలయ్యాయి. వికలాంగుల సంక్షేమ శాఖకు 76 యూనిట్లకు గానూ 22 యూనిట్లకు రూ.19 లక్షలు విడుదలయ్యాయి.