శ్మశానాలనూ వదలరు
భూ కుంభకోణాల్లో మునిగిన టీడీపీ నేతలు
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు ధ్వజం
గుమ్మఘట్ట : భూ కుంభకోణాలతో టీడీపీ నేతలు నిండా మునిగారని, మరోసారి గనుక వారికి అవకాశమిస్తే శ్మశానాలను కూడా వదిలిపెట్టరని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలంలో పలు వివాహ, శుభకార్యాలకు సతీమణి కాపుభారతితో కలిసి కాపురామచంద్రారెడ్డి హాజరయ్యారు. బేలోడులో దళిత నేత రామాంజనేయులు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పెట్టేసి ప్రజాధనం దోచుకుని.. దాచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన భూకుంభకోణాలే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు విస్మరించి, వంచించిన వైనంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యం చేస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నా పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కల పెంపకం, వంకల్లో మట్టి తవ్వకం తదితర పనుల్లో అవినీతి భారీగా జరిగిందన్నారు. రాయదుర్గానికి వచ్చిపోయే (స్థానికేతర) నాయకులను నమ్మితే అభివృద్ధి సంగతి మరిచిపోవాల్సిందేనన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా నెలలో 26 రోజులపాటు ప్రజల మధ్యనే ఉంటూ వారి పక్షాన నిలిచి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ తరఫున పోరాడుతున్నానని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ, ఎస్సీసెల్ రాష్ట్ర్ర కార్యదర్శులు ఎన్‌టీ సిద్దప్ప, గోవిందు, పార్టీ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్ ఆర్‌టీ జగన్‌మోహన్‌రెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ మల్లికార్జున పాల్గొన్నారు.