ఆస్పత్రి వద్ద గుమిగూడిన మృతురాలి బంధువులు
- ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఖమ్మం వైద్య విభాగం : చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన సంఘటన శనివారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. నిర్లక్ష్యపు వైద్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి... నాహబ్రాహ్మణ కాలనీకి చెందిన జంపాల స్రవంతి (27)కి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో బంధువులు మయూరిసెంటర్ బ్రిడ్జి పక్కన ఉన్న వాసిరెడ్డి నిర్మల ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని తెలపడంతో బంధువులు అంగీకరించారు. రాత్రి ఆపరేషన్ నిర్వహించగా ఆ మహిళకు మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే చికిత్స పొందుతున్న æబాలింత మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆమె బంధువులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహం వద్ద రోధిస్తూ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యుల వాదన మాత్రం మరోలా ఉంది. ఓవర్ బ్లీడింగ్ మూలంగానే బాలింత మృతి చెందిందని తెలిపారు. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని ప్రకటించారు.