
అక్రమాల అంతస్తులు
సాక్షి, అమరావతిబ్యూరో : రాజధాని అమరావతిలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, గుంటూరులో చోటుచేసుకున్న వరుస ఘటనలలో పలువురు మృత్యువాతకు గురయ్యారు. రెండు రోజుల కిందట విజయవాడలో ఓ భవనం కూలింది. ఆ ఘటన పగటి వేళ సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదు. అదే అర్ధరాత్రి జరిగి ఉంటే పరిస్థితిని ఊహించలేం. రాజధానిగా అమరావతి ప్రకటన వెలువడిన తరువాత గుంటూరు, విజయవాడ పరిధిలోని భూములు, స్థలాలు, నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు తరలిరావడంతో అద్దె గృహాలకు, భవనాలకు మరింత గిరాకీ పెరిగింది. ఈ అవసరాన్ని గుర్తించిన కొందరు వ్యాపారులు, బిల్డర్లు, అధికార పార్టీ నాయకులు వారి అనుచరులు, బంధువులు ఇలా అంతా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఒక్కసారిగా ఖాళీ స్థలాలలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాజధానికి S తరలివచ్చే వారికి నివాసాలు అత్యవసరం కావడంతో హడావుడిగా నిర్మాణాలు చేపట్టారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో మూడు అంతస్తులకు అనుమతి లేకపోయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటీ రెండు మినహా మిగిలిన అన్ని గ్రామాలలో 20 నుంచి 50 కట్టడాల వరకు నిర్మించారు. ఒక్క తుళ్లూరు గ్రామంలోనే దాదాపు 250 వరకు భారీ కట్టడాలు నిర్మించడం విశేషం. అదేవిధంగా మందడం, మల్కాపురం, వెలగపూడి, వెంకటపాలెం, మంగళగిరి, ఉండవల్లి, తాడేపల్లి సహా పలు గ్రామాలలో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి.
అనుమతులుండవ్....అధికారులకు ఆమ్యా...మ్యాలు
గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలలో మొత్తం 3,204 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు సమాచారం. ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు విజయవాడ నగరంలోని కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ క్రమంలో అధికారులపై పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిడి వచ్చింది. ఈ కారణంగానే అధికార పార్టీ నాయకు భవనాల జోలికి అధికారులు వెళ్లలేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అదీకాక గుంటూరు, అమరావతి నగరాలతో పాటు వివిధ మున్సి పాలిటీలలోను బహుళ అంతస్తులకు అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్‌లో ఓ మంత్రికి అత్యంత సన్నిహితురాలైన ఓ మహిళ ఈ భవన నిర్మాణాలకు అడ్డదిడ్డంగా అనుమతులు ఇప్పిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఆమె స్వయంగా గుంటూరు, విజయవాడ నగరాలలో తిష్ట వేసి అధికారులను తన వద్దకు పిలిపించుకొని కట్టడాలకు అనధికారిక అనుమతులను ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా విజయవాడలో 1809, గుంటూరులో 963, అమరావతిలో 432 భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేందుకు అనుమతులు ఇప్పించినట్లు సమాచారం. అదేవిధంగా రాజధాని ప్రాం తంలో సైతం ఇదే తరహాలో అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇప్పిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో జీ–ప్లస్ త్రీ వరకే అనుమతి ఉన్నా అంతకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో అధికశాతం తెలుగు తమ్ముళ్ల భవనాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ కట్టడాలలో సీఆర్‌డీఏ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ దృష్ట్యా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.