
మొక్క...లెక్క
జిల్లాలో హరితహారం టార్గెట్ చేరుకోలేదు. దీంతో జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపిన టార్గెట్‌ను పూర్తి చేసేవరకు మొక్కలు నాటాలని కలెక్టర్ అన్ని శాఖల ఆధికారులను ఆదేశించినట్లు సమాచారం.
- టార్గెట్ 3.54 కోట్లు.. నాటింది 2.42 కోట్లు
- లక్ష్యాన్ని చేరుకోని పలు శాఖలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం
జిల్లాలో హరితహారం టార్గెట్ చేరుకోలేదు. దీంతో జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపిన టార్గెట్‌ను పూర్తి చేసేవరకు మొక్కలు నాటాలని కలెక్టర్ అన్ని శాఖల ఆధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన హరితహారంలో ఇప్పటి వరకు 2.42 కోట్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న జిల్లా, మండల స్థాయి అధికారులపై హరితహారం ముగిసిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు పంపే అవకాశముంది. హరితహారం కింద జిల్లాలో 3.54 కోట్ల మొక్కలు నాటాలనుకున్నారు. అటవీశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 214 నర్సరీల ద్వారా మొక్కలు పంపిణీ చేశారు. అయితే గ్రామాల్లో టేకు, మామిడి, జామ, ఉసిరి ఇతర పండ్ల మొక్కలు కావాలని డిమాండ్ ఉండడంతో 26 లక్షల మెుక్కలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. రాష్ట్రం మొత్తం మీద జిల్లాలోనే అటవీ విస్తీర్ణం తగ్గిందని.. మొక్కలు ఎక్కువగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా, పలు శాఖలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినా, కొన్ని శాఖలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని, అధికారుల పనితీరుకు ఇది గీటురాయి అని వ్యాఖ్యానించడంతో మరికొన్ని శాఖల అధికారులు ఇచ్చిన లక్ష్యం కన్నా ఎక్కువగా మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. పోలీస్, డ్వామా, ఎక్త్సెజ్ శాఖలు ఇతర శాఖలతో పోలిస్తే ముందంజలో ఉన్నాయి. ప్రధానంగా డీఆర్‌డీఏ, అటవీ, ఉద్యానవన, పరిశ్రమల శాఖలు లక్ష్యానికి దూరంగా ఉండడం గమనార్హం. దేవాదాయ, సింగరేణి, ఐటీడీఏ పరిధిలో మొక్కలను విస్తతంగా నాటుతున్నారు.
+ పలు శాఖలు హరితహారం కింద ఇచ్చిన టార్గెట్.. నాటిన మొక్కల సంఖ్య (బుధవారం వరకు )ఇలా ఉంది.
శాఖ టార్గెట్ నాటింది
అటవి 54 లక్షలు 33.53 లక్షలు
డీఆర్‌డీఏ 60 లక్షలు 22.70 లక్షలు
మున్సిపాలిటీలు 10 లక్షలు 8 లక్షలు
ఉద్యానవన 2.23 లక్షలు 77 వేలు
పరిశ్రమలు 3.5 లక్షలు 78 వేలు
విద్యాశాఖ 25 లక్షలు 23 లక్షలు
కార్యాలయాలు 3.8 లక్షలు 2.57 లక్షలు
ఎక్త్సెజ్ 40 వేలు 40 వేలు
డ్వామా 25 లక్షలు 28 లక్షలు
పోలీస్ లక్ష 7.45 లక్షలు
ఇంకా పలుశాఖలు, సంస్థలు లక్షల్లో మొక్కలు నాటాయి.
వన సేవకులపై ప్రచారం ఏదీ..?
హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు వన సేవకులను పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 400 మొక్కల సంరక్షణకు ఒక వన సేవకుడిని నియమించుకోవాలి. ఒక్కో మొక్క సంరక్షణకు ఇతడికి నెలకు రూ.5 ఇస్తారు... అంటే నెలకు రూ.2వేలు చెల్లించాలి. అయితే దీనిపై ప్రచారం పెద్దగా లేకపోవడంతో ఎక్కడా వన సేవకుల నియామకం జరగలేదు. దీంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ఎండల ప్రభావం ఉంటే మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మొక్కల సంరక్షణకు వన సేవకుల అవసరం ఉంటుంది. మొక్క నాటిన నుంచే సేవకులను పెడితే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనుంది. మొక్క సంరక్షణకు డ్వామా కింద రూ.80 చెల్లిస్తారు. తుమ్మ కంపను మొక్క చుట్టూ ఏర్పాటు చేయాలి. దీనిపై కూడా గ్రామాల్లో ప్రచారం లేదు. ఈ నిధులను ఉపయోగించుకుంటే నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం బతికే అవకాశముంది.