- ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు
అనంతపురం ఎడ్యుకేషన్ :
ఉపాధ్యాయ బదిలీల్లో పనితీరు సూచికలు తొలగించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో రెన్నెల్లుగా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టింది. సోమవారం స్థానిక పదో తరగతి స్పాట్ కేంద్రం వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఒంటేరు మాట్లాడుతూ టీచర్ల బదిలీల్లో పనితీరు సూచికలు అనేది అశాస్త్రీయమన్నారు.
గతేడాది బదిలీల్లో ఈ పనితీరు సూచికలు గందరగోళంగా మారాయని గుర్తు చేశారు. కొలబద్ధత, ప్రామాణికత, పారదర్శకత లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బలం, పలుకుబడి కల్గిన టీచర్లకు ఈ పనితీరు సూచికలు వరంగా మారాయన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా, ఒక్కో డివిజన్‌లో ఒక్కో విధంగా వినియోగించుకున్నారన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన టీచర్ల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్‌టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, జయరాంనాయక్, నాయకులు రవీంద్రబాబు, బాలసుబ్రమణ్యం, ఎస్‌ఎల్‌టీఏ శివానందరెడ్డి, ఆదిశేషు, ఉపాధ్యాయ సత్తా ఫయాజ్, చంద్రమౌళి, ఎంఎస్‌పీటీఏ చంద్రశేకర్‌నాయుడు, ఆపస్ జిల్లా అధ్యక్షుడు టి.వెంకటేశ్వరప్రసాద్, పీఈటీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.