
మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్ : వినియోగదారులు హక్కులతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలñ క్టర్ మాట్లాడుతూ ప్రజలు వినియోగదారుల పాత్ర పోషిస్తున్నప్పుడు తాము కొనుగోలు చేస్తున్న వస్తువుల నాణ్యతను పరిశీలించాలన్నారు. వస్తువు నాణ్యతాప్రమాణాలు, వస్తువుకు సంబంధించిన బిల్లును పరిశీలించినప్పుడే విక్రయదారుడిని ప్రశ్నించగలుగుతామని చెప్పారు. వినియోగపు వస్తువుల్లో నాసిరకం, కల్తీ వస్తువులు, తూకంలో తగ్గుదల వంటి ఫిర్యాదులను వినియోగదారుల ఫోరం బాధ్యులు సంబంధిత శాఖల అధికారులకు అందిస్తే విక్రయదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతిరోజు ఉపయోగించే పాలు, వంటనూనెలు, పెట్రోల్, ఆహార ధాన్యాల్లో కల్తీ, నాసిరకం వస్తువులను పూర్తి అరికట్టేందుకు వినియోగదారులు ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలపై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పిచ్చయ్య పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందిస్తూ బస్సుల్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆర్‌ఎంను కలెక్టర్ ఆదేశించారు. బస్టాండ్‌లలో ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, సిటీ బస్సుల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, విలీన గ్రామాల్లో లైటింగ్ తదితర సమస్యలను సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. జేసీ దివ్య మాట్లాడుతూ పౌరసరపరాలశాఖ వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోటళ్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా తరచూ అధికారిక బృందాలు తనిఖీ చేస్తున్నాయని చెప్పారు. వంటనూనెలు, పెట్రోల్‌లో జరిగే కల్తీని అరికట్టేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తారని వివరించారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వినియోగదారులు అమ్ముకుంటున్నారని, దీని ద్వారా సబ్సిడీకి నష్టం కలుగుతుందని, ప్రజలను చైతన్యం చేయాలని వినియోగదారుల ఫోరం సభ్యులు కోరారు. మినరల్ వాటర్ పేరుతో నడుస్తున్న అక్రమ వాటర్‌ప్లాంట్లపై దాడులు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ ఉషారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.