ఆస్పత్రిలో ఒక్క పడక మీద ఇద్దరు, ముగ్గురు రోగులు సర్దుకోవాలి. అప్పుడే అక్కడ వైద్యం అందుతుంది. లేదంటే కటిక నేలే గతి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా... పాలకులు పట్టించుకోకపోవడంతో రోగులు అవస్థలపాలవుతున్నారు. ఈ ఆస్పత్రిలో కేవలం 100 పడకలే ఉండగా... ఆదివారం అర్ధరాత్రి సమయానికి 239 మంది ఇన్ పేషెంట్లుగా నమోదయ్యారు.
సోమవారం ఉదయం మరో 38 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా వచ్చారు. దీంతో ఇంత మందిని ఎక్కడ సర్దుబాటు చేయాలో సిబ్బందికి పాలుపోవడం లేదు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురితోపాటు కొందరిని నేలపై ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరో వైపు సిబ్బంది కొరత అధికారులను పీడిస్తోంది. పరిమితంగా ఉన్న సిబ్బంది అంతమంది రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు.
దీంతో రోగులకు నరకం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశాలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ఏరియా ఆస్పత్రిలో కేవలం 100 పడకలే ఉండటం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఆస్పత్రిని 200 పడకల సామర్థ్యానికి పెంచుతామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నా.. కార్యరూపం దాల్చడం లేదు.