
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
- పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేదు
- ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారు
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
వజ్రకరూరు : రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన సాగుతోందని, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఉరవకొండ మండలం నింబగల్లులో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో శాసన సభ్యులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, పింఛన్లు, సబ్సిడీ రుణాల మంజూరులో ప్రజాప్రతినిధులకు హక్కులేకుండా చేసి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ, అంగన్‌వాడీ కమిటీ, అసైన్ కమిటీలను నామమాత్రం చేసి విలువలేకుండా చేశారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సమావేశాల్లో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలోనూ అధికార పార్టీ నాయకుల జోక్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వ ఆసత్రిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పెత్తనం ఎక్కువైపోయిందనీ, చివరికి తాగునీటి పనులను కూడా ఆపుతున్నా రని చెప్పారు. టీడీపీ నాయకులు అన్ని అధికారాలు అనుభవిస్తున్నా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వాతావరణ కింద బీమా కూడ ఇవ్వలేదని, వర్షాభావంతో పప్పుశనిగ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇన్సూరెన్సు చేయించడంలో కూడా అధికారులు నిర్లక్షం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి టీడీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారపార్టీ నాయకులు, ప్రభుత్వపెద్దలు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.