కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికని నదిలోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశామని గప్పాలు కొట్టిన ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
మరో ఘటనలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలోని పున్నమిఘాట్ సమీపంలో ఏపీ టూరిజం విహార యాత్ర బోటు నుంచి ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు. ఇది గుర్తించిన బోటు డ్రైవర్ గజ ఈతగాళ్ల సాయంతో అతన్ని కాపాడి భవానీపురం పోలీసులకు అప్పగించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారానికి చెందిన దొరబాబు(33)గా గుర్తించారు. భార్యతో మనస్పర్థలు, కుటుంబ కలహాలతోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.