అతి వేగం.. గర్భశోకం
- రెండు కుటుంబాల్లో విషాదం నింపిన కొత్త సంవత్సర వేడుకలు
- రాజంపేటలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
రాజంపేట: కొత్త సంవత్సర వేడుకలంటే యువతకు అదో జోష్.. అర్ధరాత్రి ఈలలు.. కేకలు వేసుకుంటూ బైకులపై అతి వేగంగా వెళుతూ ఉంటే వారికి అదో ఆనందం.. కానీ వీరి సంతోష సమయంలో ఏమాత్రం పొరబాటు జరిగినా కన్నవారికి కడుపు కోత మిగులుతుందనే కనీస ఆలోచన చేయడం లేదు. పర్యవసానంగా కొత్తసంవత్సరం వేళ రాజంపేటలో ఇద్దరు యువకులు మృత్యువాత పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారు.
చావు బతికుల మధ్య యువకుడు
కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం అర్ధరాత్రి రాజంపేట పట్టణంలో రెండు బైకులు అతివేగంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతివేగం..ప్రమాదకరమని తెలిసినా..అధునాతనమైన బైకులో వెళ్లే యువకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రాజంపేట పరిసర ప్రాంతాల్లో గల్ఫ్‌పై ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. ఎక్కడో తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే, ఇక్కడ ఆ డబ్బులతో జల్సా చేసే వారు అనేకమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజంపేట పట్టణంలోని ఆర్వోబీ(రైల్వేఓవర్ బ్రిడ్జి)పై శనివారం అర్ధరాత్రి బైకులు ఢీకొన్న సంఘటనలో సాయిప్రసాద్, వినోద్ అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఆ ఇంటికే ఒక్కడే..
బైకులు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన సాయిప్రసాద్ వారి కుటుంబానికి ఒక్కడే కొడుకు కావడం గమనార్హం. వీరబల్లి మండలంలోని సానిపాయికి చెందిన సురేంద్ర రాజంపేట పట్టణంలోని బలిజపల్లెలో నివసిస్తున్నాడు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. సురేంద్ర, నీలావతి దంపతులకు సురేంద్ర, కూతురు ఉన్నారు. సాయిప్రసాద్ అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తండ్రి కువైట్ నుంచి వస్తున్నట్లు బంధువులు తెలిపారు.
కొడుకును పోగొట్టుకున్న టైలర్ కుటుంబం
ఈ సంఘటనలో మృతి చెందిన వినోద్ ఎన్‌ఐటీఎస్‌లో బీటెక్(మెకానికల్) పూర్తి చేశాడు. తండ్రి తిరుపాలు, హైమావతి దంపతులకు చివరి కొడుకు వినోద్. తండ్రి టైలర్ వృత్తిని చేపట్టి కుమారున్ని ఉన్నత విద్యను అతిక ష్టంమీద చదవించారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితునితో కలిసి ఇంటినుంచి వెళ్లిన కుమారుడు మృతదేహమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.