చంపినోళ్లకు రూ 4 లక్షలు.. మధ్యవర్తికి రూ.8 లక్షలు
- భర్త హత్యకు భార్య సుపారీ
- సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్:
మోసం చేస్తున్న భర్తను కడతేర్చేందుకు ఓ భార్య కిరాయి హంతకులకు రూ.12 లక్షల సుపారీ ఇచ్చింది. చంపిన వ్యక్తులకు రూ.4 లక్షలు, ఒప్పందం కుదిర్చిన మధ్యవర్తికి రూ.8లక్షల చొప్పున డీల్‌తో హత్యకు కుట్రపన్నారు. పథకం ప్రకారం హతమార్చేందుకు ఒడిగట్టినా అదృష్టవశాత్తు ఒక కత్తిపోటు దిగగానే బాధితుడు కేకలు వేయడం, సమీపంలో పోలీసు వాహనం సైరన్‌మోగడంతో నిందితులు పారిపోయారు. ఈనెల 14న అనంతపురంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 14న రామ్‌నగర్‌లోని కోకాకోలా గోడౌన్ వద్ద కోవూరునగరకు చెందిన వెంకటరాంప్రసాద్‌పై హత్యాయత్నం జరిగింది. మెడపై కత్తి దిగిన క్షతగాత్రున్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముందు నుంచి ఈ కేసులో భార్య తరపునే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ కోణంలోనే విచారించిన పోలీసులను నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4 నిందితురాలిగా రాంప్రసాద్ భార్య కళ్యాణి, ఏ5 నిందితురాలిగా అత్త విజయలక్ష్మిని నమోదు చేశారు. హత్యలో పాల్గొన్న ఏ1, ఏ2, ఏ3, ఏ6 నిందితులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామానికి పెద్దవీరప్పగారి నాగేంద్ర, అచ్యుతాపురం గ్రామానికి చెందిన చిన్నకుళ్ళాయప్ప, అదే గ్రామానికి చెందిన బాలకుళ్ళాయప్ప, తిమ్మంపల్లికి చెందిన ఆవేటి వెంకటశివుడు ఉన్నారు. వీరి నుంచి ద్విచక్రవాహనం, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
చంపడమే మేలని..
వెంకటరాంప్రసాద్‌కు కళ్యాణితో 2011లో వివాహమైంది. ప్రసాద్ ధర్మవరంలో ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కళ్యాణి బెంగుళూరులో ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ధర్మవరంలో కాపురం ఉంటూ ప్రతి శని, ఆదివారాల్లో కళ్యాణి బెంగళూరు నుంచి వచ్చేది. అయితే వివాహం జరిగినప్పటి నుంచి ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. తన భర్త వేధిస్తున్నాడని కళ్యాణి బెంగళూరులో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో ధర్మవరంలో పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇద్దరినీ రాజీ చేశారు. తర్వాత కూడా రాంప్రసాద్ కలిసి కాపురం చేయలేదు. విడాకుల కోసం జిల్లా ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ కేసు వాయిదాలకు ఇద్దరూ హాజరయ్యేవారు. కళ్యాణి పడుతున్న ఇబ్బందులను ఆమె తల్లి విజయలక్ష్మి చూసి తీవ్రంగా మదనపడుతుండేది. ఎలాగైనా అల్లుడిని చంపాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని తనకు తెలిసిన తిమ్మంపల్లికి చెందిన వెంకటశివుడుకు చెప్పింది. ఇంతలో మరికొంతమంది పెద్ద మనుషులు కలిసి విడాకుల కేసు రాజీ అయ్యేలా భార్యాభర్తలతో మాట్లాడారు. గత జూలై 18న కళ్యాణిని పిలుచుకొని విజయలక్ష్మి అల్లుడు రాంప్రసాద్ ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లోకి ఆహ్వానించకుండా రాంప్రసాద్ ఇష్టానుసారం తిట్టి పంపించాడు. ఈ బాధను భరించే కన్నా రాంప్రసాద్‌ను చంపడమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు.
12 లక్షలకు సుపారీ
విజయలక్ష్మి తన బంధువు అయిన తిమ్మంపల్లికి చెందిన వెంకట శివుడుకు ఫోన్‌చేసి జరిగిన అవమానాన్ని వివరించింది. దీంతో వెంకటశివుడు.. తిమ్మంపల్లికి చెందిన నాగేంద్ర కలిసి విజయలక్ష్మితో వినాయకచవితి పండుగకు ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు. శివుడుకి రూ.8లక్షలు, నాగేంద్రకు రూ.4లక్షలు ఇచ్చేలా తీర్మానించుకున్నారు. ఒప్పందం ప్రకారం హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 14న వెంకటరాంప్రసాద్ కోర్టులో వాయిదాకు వస్తాడని విజయలక్ష్మి, కళ్యాణిలు తెలియజేశారు. నాగేంద్రకు అడ్వాన్స్‌గా రూ.20వేలు ఇచ్చారు. పని అయిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తామని చెప్పడంతో నిందితులు అంగీకరించారు. అచ్యుతాపురానికి చెందిన చిన్నకుళ్ళాయప్ప, బాలకుళ్లాయప్పల సహకారం తీసుకున్నారు. ఈనెల 13న ద్విచక్రవాహనంలో జిల్లా కేంద్రానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కోర్టు వద్దకు చేరుకున్నారు. వెంకటరాంప్రసాద్‌ను నిందితులకు వెంకటశివుడు, విజయలక్ష్మి చూపించారు. పథకం ప్రకారం కోకాకోలా గోడౌన్ వద్ద ద్విచక్రవాహనంతో రాంప్రసాద్‌ను ఢీకొట్టి వెంట తెచ్చుకున్న పిడిబాకుతో మెడపై బలంగా పొడిచారు. దీంతో బాధితుడు రాంప్రసాద్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆ సమయంలో బెటాలియన్ ఆర్‌ఐ దస్తగిరి, కానిస్టేబుల్ కుమార్ వాహనంలో అటువైపు వస్తుండగా ఘటనను చూసి వాహనంతో సైరన్ మోగించారు. దీంతో నిందితులు ద్విచక్రవాహనంలో పారిపోయారు. నిందితులు బుక్కరాయసముద్రం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో నాల్గవ పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితున్ని పరోక్షంగా కాపాడిన ఆర్‌ఐ దస్తగిరి, కానిస్టేబుల్ కుమార్, నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన కానిస్టేబుళ్లు మెహతాజ్, నాగరాజులను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందించి నగదు రివార్డులను అందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ, నాల్గవపట్టణ సీఐ శ్యామరావు తదితరులు పాల్గొన్నారు.