
అనంతపురం క్రైం: అనంతపురంలోని తపోవనానికి చెందిన నారాయణస్వామి మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... నగరంలోని ప్రశాంతినగర్‌కు చెందిన జి.ఆదినారాయణకు బళ్లారి బైపాస్ ప్రాంతంలో స్థలం ఉంది. ఈ స్థలంలోని షెడ్డులో నారాయణస్వామి కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. గత నెల 5న షెడ్డు వద్ద నారాయణస్వామి, కుటుంబసభ్యులు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో ఆదినారాయణ, అతని కుమారుడు నవీన్‌కుమార్ అక్కడికెళ్లారు. షాపు ఖాళీ చేసి తీరాలంటూ గట్టిగా హెచ్చరించారు. ఆ సమయంలో నవీన్‌కుమార్‌పై నారాయణస్వామి కుమారుడు పవన్ దాడి చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణస్వామి, ఆయన భార్య అంజినమ్మ, కుమారుడు పవన్‌పై ఐపీసీ 324 సెక్షన్ కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఊండ్ సర్టిఫికెట్ ఆధారంగా మరో సెక్షన్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయంగా విచారణకు స్టేషన్‌కు రావాలని నిందితులకు సూచించారు. అప్పటి నుంచి నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం ఉదయం కోర్టు ఆవరణలో నారాయణస్వామి, అంజినమ్మ ప్రత్యక్షమయ్యారు.
నారాయణస్వామి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి జడ్జి ఓంకార్ ముందుకెళ్లి రూరల్ పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయాడు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి ఆదేశాల మేరకు.. కోర్టు సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై నారాయణస్వామిని ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి)