మా బడి.. మా పిల్లలు | theegul narsapur school success story | Sakshi
Sakshi News home page

మా బడి.. మా పిల్లలు

Published Thu, Aug 11 2016 9:21 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

తీగుల్‌ నర్సాపూర్‌లో ప్రాథమిక పాఠశాల - Sakshi

తీగుల్‌ నర్సాపూర్‌లో ప్రాథమిక పాఠశాల

  • ప్రభుత్వ బడిని బతికించుకున్న స్థానికులు
  • ఇక్కడి పిల్లలు ఇక్కడి పాఠశాలకే
  • సర్పంచ్‌ పిల్లలు కూడా సర్కార్‌ బడికే
  • 20 నుంచి 55కు చేరిన విద్యార్థుల సంఖ్య
  • హెచ్‌ఎం కృషి.. స్థానికుల ఐక్యత
  • ఆదర్శంగా నిలుస్తోన్న తీగుల్‌ నర్సాపూర్‌ బడి
  • జగదేవ్‌పూర్‌: ‘మా బడి.. మా పిల్లలు’ నినాదంతో సర్కార్‌ బడిని బతికించుకున్నారు తీగుల్‌ నర్సాపూర్‌ వాసులు. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో బడిని మూసేస్తారేమోనన్న భయం వారిని వెంటాడింది. ప్రధానోపాధ్యాయురాలి చొరవ.. స్థానికుల ఐక్యత వల్ల బడిని బతికించుకున్నారు. ఐదోతరగతి లోపు వారందరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. సర్పంచ్‌ సైతం తన ఇద్దరు పిల్లలనూ సర్కార్‌ బడికే పంపుతున్నారు. స్థానికుల్లో వచ్చిన మార్పు సర్కార్‌ బడికి ప్రాణం పోసింది.

    మండలంలోనే చిన్న గ్రామం తీగుల్‌ నర్సాపూర్‌. గ్రామ జనాభా 680. ఓటర్లు 412మంది. కుటుంబాలు 220. గ్రామంలో ఎక్కువగా వ్యవసాయమే జీవనధారం. గ్రామంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య సుమారు 120 మంది వరకు ఉంటారు. గ్రామంలో గత కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంత కాలంగా పల్లె పల్లెకు ప్రైవేట్‌ విద్యా సంస్థలు రావడంతో ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.

    మొదట్లో 50 మంది ఉండగా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడి విద్యార్థులు జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, కుకునూర్‌పల్లిలోని ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్తేవారు. గత రెండు మూడేళ్ల నుంచి ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గింది. గత ఏడాది 20కి చేరుకుంది. దీంతో ఒక్కరే టీచర్‌ విద్యార్థులకు చదువు చెప్పేవారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేస్తామని ఈసారి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.

    పాఠశాల హెచ్‌ఎం సమత స్థానికులతో చర్చించారు. బడిని బతికించుకోవాలన్న సంకల్పం వారిలో కల్పించారు. వెంటనే సర్పంచ్‌ రజిత రమేష్‌,  విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సభను ఏర్పాటు చేసి ఐదోతరగతిలోపు పిల్లలను మన బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌, గఢా అధికారి హన్మంతరావులకు అందించారు. గ్రామస్తుల ఐక్యతను అధికారులు మెచ్చుకున్నారు.

    నాడు 20.. నేడు 55 మంది విద్యార్థులు
    గత ఏడాది స్థానిక పాఠశాలలో కేవలం 20 మందే ఉండగా ఈ సారి వారి సంఖ్య భారీగా పెరిగింది. గ్రామంలోని ఐదోతరగతి పిల్లలంతా స్థానిక ప్రభుత్వ బడికే రావడంతో విద్యార్థుల సంఖ్య 55కు చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితోపాటు మరో ముగ్గురు విద్య వలంటీర్లు విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు.

    పాఠశాల అభివృద్ధి.. పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు తలాకొంత నిధి ఏర్పాటు చేసుకుని ముగ్గురు వీవీలను నియమించుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్నారు. ఇటీవల గ్రామస్తుల కోరిక మేరకు ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌ డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయురాలిని  నియమించారు. దీంతో మొత్తం ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారు.

    ముందుకు వచ్చిన దాతలు
    పాఠశాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలను అందించారు. సీసీఎం(ఎన్‌జీఓ) ఫౌండేషన్‌ వారు పాఠశాల విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలు అన్ని తరగతుల వారికి అందించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇంగ్లిష్‌ విద్యను కూడా అందిస్తున్నారు. మరో సామాజిక సేవకుడు కళోబ్‌ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, షూస్‌ అందించారు.

    ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఇలా
    పాఠశాలలో ఒకటో తరగతిలో 37, రెండోతరగతిలో 12, మూడో తరగతిలో 3, నాలుగో  తరగతిలో లేరు, ఐదోతరగతిలో 3 విద్యార్థులతో బడి కళకళలాడుతుంది. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. రెండు గదులు, మరుగుదొడ్డి, మంచినీటి వసతి ఉంది.

    వారి ఐక్యత మరిచిపోలేనిది
    గ్రామస్తుల ఐక్యతతోనే నేడు బడి నిలబడింది. గ్రామం నుంచి సర్కార్‌ బడి పోతే మళ్లీ రాదనే విషయాన్ని వారికి వివరించాం. వెంటనే సర్పంచ్‌తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఐదోతరగతి వరకు స్థానిక పిల్లలను స్థానిక బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. విద్యార్థులకు గుణత్మాక విద్యను అందించడమే మా లక్ష్యం. - సమత, పాఠశాల హెచ్‌ఎం

    ఆనందంగా ఉంది
    మా గ్రామంలోని ప్రభుత్వ బడిలో విద్యా వలంటీర్‌గా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను డిగ్రీ పూర్తి చేశా. గతంలో ప్రైవేట్‌ పాఠశాలలో పని చేశా. అంతంగా సంతృప్తి కలుగలేదు. మా ఊరి పిల్లలకు నేనే పాఠాలు చెప్పడం కన్నా సంతోషం మరోటి లేదు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తా. - శిరీష, విద్యా వలంటీర్‌

    ఆదర్శ బడిగా తీర్చిదిద్దుకుంటాం
    మా పిల్లలు.. మా ఊరి బడికే అనే నినాదాన్ని తీసుకున్నాం. ఐదోతరగతి లోపు పిల్లలను స్థానికంగా గల ప్రభుత్వ బడికే పంపిస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బడిపై అవగాహన కల్పించారు. గ్రామస్తులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వెంటనే తీర్మానం చేసి తలాకొంత నిధి ఏర్పాటు చేసుకుని 35 మంది విద్యార్థులను కొత్తగా బడిలో చేర్పించాం.  ముగ్గురు విద్యా వలంటీర్లను నియమించుకున్నాం. మా ఇద్దరి పిల్లలను కూడా చేర్పించాం. ఆదర్శ బడిగా తీర్చిదిద్దుకుంటాం. - రజిత, సర్పంచ్‌

    ప్రైవేట్‌ కన్నా నయం
    నాకు ఇద్దరు పిల్లలు. జగదేవ్‌పూర్‌లోని ప్రైవేట్‌ బడికి గత రెండుమూడేళ్ల నుంచి పంపిస్తున్నా. పిల్లలకు అక్షర ముక్క రాలేదు. ఏడాదికి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టినం. ఇప్పుడు  మా ఊరి బడిలోనే చేర్పించా. మంచిగా చదువుతుండ్రు. మంచిగా చెప్పాలని టీచర్లకు చెప్పినం.- విజయ, విద్యార్థి తల్లి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement