కనకమహలక్ష్మి ఆలయంలో చోరీ
Published Thu, Jul 28 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
అమ్మవారి ఆలయంలో దొంగలు
చీపురుపల్లి : కోర్కెలు తీర్చే కల్పవల్లి, చీపురుపల్లి ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగుచూడడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఆలయంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే దొంగలు గర్భగుడిలోకి సైతం ప్రవేశించినప్పటికీ ఎలాంటి బంగారు ఆభరణాలు లభించకపోవడంతో దేవాదాయశాఖ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దేవాదాయశాఖ మేనేజర్ జి.శ్రీరామ్మూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి దూరంగా ఉన్న అమ్మవారి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం గొళ్లెం స్క్రూలు విప్పి లోపలికి ప్రవేశించారు. అక్కడ నుంచి గర్భగుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి గొళ్లెం తొలగించి లోపలకి ప్రవేశించారు. అయితే వారికి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో అమ్మవారి విగ్రహంపైనున్న రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై దేవాదాయ శాఖ మేనేజర్ జి. శ్రీరామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి దూరంగా ఆలయం ఉండడంతో బంగారు ఆభరణాలు ఆలయంలో ఉంచడం లేదని మేనేజర్ తెలిపారు.
Advertisement
Advertisement