వెల్దుర్తి: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బజావత్ చెందు(30) తనకున్న పొలంలో రెండేళ్ల నుంచి పంట సాగు కోసం చేసిన అప్పు పెరిగి రూ. 2లక్షలకు చేరింది. ఏడాది నుండి పంటలు పండక, చేసిన అప్పు భారమైంది.
ఆపై సోదరి పెళ్లి ఎలా చేయాలో అర్థం కాక మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బుజ్జి ఇప్పుడు గర్భవతి. ఇద్దరు కూతుళ్లు అంజలి, కావ్యలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.