అక్కడ రాజీ... ఇక్కడ ఉద్యమ డ్రామా
Published Sat, Aug 10 2013 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ఢిల్లీలో సోనియాగాంధీతో రాజీపడి, ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమమంటూ ప్రజలకు నామాలు పెట్టేందుకే మంత్రి గల్లా అరుణకుమారి సరికొత్త రాజీనామా నాటకానికి తెరతీశారని వైఎస్‌ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సమైక్యాంధ్ర ఉద్యమం తొమ్మిదేళ్లుగా నలుగుతుంటే ఏ మాత్రమూ స్పందించని ఆమె ఇప్పుడు ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహిస్తే నమ్మడానికి జిల్లా ప్రజలు అమాయకులు కారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పదవులు అనుభవిస్తూ తాను కూడా సమైక్యం కోసం రాజీ నామా చేశానని మంత్రి చెప్పడం ఉద్యమకారులను, జిల్లా ప్రజల మనోభావాలను అపహాస్యం చేయడమేనన్నారు. సమైక్యవాదంపై, ప్రజాస్వామ్య విలువలపై చిత్తశుద్ధి ఉంటే ఆమె తన పదవులకు రాజీనామాచేసి తర్వాత ఉద్యమాలు నడపాలని సూచించారు.
తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో నిజంగా ప్రజల భాగస్వామ్యం ఉందా? వాళ్ల ఫ్యాక్టరీ కార్మికుల భాగస్వామ్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సమైక్య ఉద్యమంలో తన సొంత నియోజకవర్గంలోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతిచెందితే ఇంతవరకు వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించని మంత్రి సమైక్య ర్యాలీ చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి విధానాలు, తీరును యావగించుకున్న ప్రజలు పల్లెల్లోకి రానీయకుండా తిరగబడతారనే ఉద్దేశంతో ఉద్యమాలతో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై మమకారం ఉంటే ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేపట్టాలని కోరారు.
Advertisement