Arunakumari
-
'కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు'
ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది. ► నైటింగేల్ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు. అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్ఎమ్గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు. ► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్ లో వేశాడు. అక్కడే టెంత్ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్ ట్రెయినింగ్ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్‌నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది. అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని యుహెచ్పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్ తర్వాత ఎఎన్‌ఎమ్‌గా శిక్షణ తీసుకున్నాను. ► కోవిడ్–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు.. శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన. అరుణ: కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్ ఎక్కించి, హోమ్ క్వారంటైన్లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్ చెక్ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్ తర్వాత కూడా అందరం ఆన్‌డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం. ► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు.. శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్హెచ్ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ. అరుణ: ఇప్పటివరకు బెస్ట్ ఏఎన్ఎమ్గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్ డ్యూటీ చేసినందుకు కేటీఆర్ సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్ ఇస్తూనే ఉంది. ► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు. అరుణ: ట్రెయినింగ్ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నిలదొక్కుకున్నాను. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో నర్సింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా. – నిర్మలారెడ్డి -
వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
ఈ ఏడాది 3,100 ఎకరాల విస్తరణ లక్ష్యం పట్టు పరిశ్రమశాఖ జేడీ సి.అరుణకుమారి అనంతపురం అగ్రికల్చర్: వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని పట్టు పరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి ‘సాక్షికి తెలిపారు. ఈ ఏడాది 3,100 ఎకరాల్లో కొత్తగా మల్బరీ విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాలు ప్రారంభం కావడం, గరిష్ట ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో రేషం పెంపకానికి రైతులు మొగ్గు చూపిస్తున్నారని ఆమె తెలిపారు. ట్రీప్లాంటేషన్ పద్ధతి వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడినా సమస్య ఉండదన్నారు. ట్రీప్లాంటేషన్కు ఎకరాకు సబ్సిడీ రూపంలో రైతులకు 22,500 అందజేస్తామన్నారు. రైతులకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుండటంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ప్రతిపాదించామన్నారు. క్రాస్‌బ్రీడ్ (సీబీ) రకాన్ని తగ్గించి బైవోల్టీన్ రకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 44 లక్షల బైవోల్టీన్ గుడ్లు ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉపాధిహామీ కింద 250 షెడ్లు మంజూరయ్యాయన్నారు. గతంలో మాదిరిగా అన్ని రకాల పథకాలు రాయితీతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మల్బరీకి మించిన లాభదాయకమైన పంట మరొకటి లేనందున రైతులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. -
గర్భిణీ అనుమానాస్పద మృతి
గోరంట్ల : గోరంట్లకు చెందిన నిండు గర్భిణి అరుణకుమారి(20) అనుమానాస్పద స్థితిలో మరణించారు. కట్నం కోసం భర్తే హత్య చేశాడని హతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు, హతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు... నెల్లూరుకు చెందిన వట్టి శివశంకర్, సుజాత దంపతుల కుమార్తె అరుణకుమారిని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు గోరంట్ల ఆంజనేయకాలనీలో నివసిస్తున్నారు. అత్తమామలు జీవనోపాధి కోసం చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేయించారు. వారి సంసారం కొంతకాలం సజావుగా సాగినా, ఆ తరువాత కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అరుణ తల్లిదండ్రులు అల్లుడి కోరిక మేరకు స్కూటీని కొనిచ్చారు. అయితే ఆమె గర్భిణి కావడంతో అడిగినంత కట్నం ఇస్తారని భావించి చిత్రహింసలు పెట్టడం తీవ్రం చేశాడని అరుణ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగిందని, అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఐదు నెలలు గర్భిణీ కావడంతో వాంతులు అధికం కావడంతో ఆస్పత్రికి తరలించామని స్థానికులను నమ్మించారని వారు ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ హసీనా సుల్తానా ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. భర్త శ్రీనివాసులను స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి గురువారం రాత్రి గోరంట్లకు చేరుకుని విచారణ చేపట్టారు. -
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లపై విచారణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్యారోగ్యశాఖ సంచాలకుల (ఆర్డీ) కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతలు తీసుకున్నారనే ఆరోపణలపై బుధవారం విచారణ చేపట్టారు. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని విచారణ చేశారు. గతంలో ఆర్డీ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్( ఏఎస్ఓ) గా పనిచేసిన సాయిబాబు అనే ఉద్యోగి నకలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతి పొందాడని ఓ వ్యక్తి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో సదరు ఉద్యోగిపై విచారణ చేసి అతడిని ఎల్డి కంప్యూటర్‌గా ఉద్యోగ కేడర్ తగ్గించి ప్రకాశం జిల్లాకు బదలీ చేశారు. దీంతో సదరు ఉద్యోగి ఆర్డీ కార్యాలయం పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు నకలీ విద్యార్హలతో పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆ ఫిర్యాదుపై విచారణ జరిగింది. గుంటూరులో ఏఎస్ఓలు గా పనిచేస్తున్న జి. వెంకటలక్ష్మి, కె.శ్రీనివాసరెడ్డి, డీఎస్‌ఓగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావు, తెనాలిలో ఏఎస్ఓగా పనిచేస్తున్న ఎంవీ ప్రసాదరావు, హైదరాబాద్‌లో ఏఎస్ఓగా పనిచేస్తున్న డి జయంత్, బాపట్లలో ఏఎస్ఓగా పనిచేస్తున్న షేక్ సయ్యద్ షరీఫ్, ఒంగోలులో ఏఎస్ఓగా పనిచేస్తున్న కె.కామేశ్వరరావు, పి. మణిగంధకుమార్, నెల్లూరులో ఏఎస్ఓగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసమూర్తి, పిడుగురాళ్లలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర్లు, పొదిలిలో రేడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న తిప్పయ్యలపై ఫిర్యాదు అందటంతో విచారణ జరిగింది. వీరంతా 2002 సంవత్సరంలో పదోన్నతులు పొందగా నేడు వారివి తప్పుడు సర్టిఫికెట్లు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. -
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిచిన సేవలు
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రి అనస్థీషియన్ అరుణకుమారిపై గురువారం రోగి బంధువులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా శుక్రవారం ఉదయం సిబ్బంది, పీజీ విద్యార్థులు, వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారంతా తదుపరి నిరసన కార్యక్రమాలపై ఆస్పత్రి ప్రాంగణంలో సమావే శమై చర్చిస్తున్నారు. అయితే, ఓపీ సేవలు నిలిచిపోవటంతో పెద్ద సంఖ్యలో రోగులు ఆస్పత్రి వద్ద వేచి చూస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. -
అక్కడ రాజీ... ఇక్కడ ఉద్యమ డ్రామా
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ఢిల్లీలో సోనియాగాంధీతో రాజీపడి, ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమమంటూ ప్రజలకు నామాలు పెట్టేందుకే మంత్రి గల్లా అరుణకుమారి సరికొత్త రాజీనామా నాటకానికి తెరతీశారని వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం తొమ్మిదేళ్లుగా నలుగుతుంటే ఏ మాత్రమూ స్పందించని ఆమె ఇప్పుడు ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహిస్తే నమ్మడానికి జిల్లా ప్రజలు అమాయకులు కారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పదవులు అనుభవిస్తూ తాను కూడా సమైక్యం కోసం రాజీ నామా చేశానని మంత్రి చెప్పడం ఉద్యమకారులను, జిల్లా ప్రజల మనోభావాలను అపహాస్యం చేయడమేనన్నారు. సమైక్యవాదంపై, ప్రజాస్వామ్య విలువలపై చిత్తశుద్ధి ఉంటే ఆమె తన పదవులకు రాజీనామాచేసి తర్వాత ఉద్యమాలు నడపాలని సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో నిజంగా ప్రజల భాగస్వామ్యం ఉందా? వాళ్ల ఫ్యాక్టరీ కార్మికుల భాగస్వామ్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సమైక్య ఉద్యమంలో తన సొంత నియోజకవర్గంలోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతిచెందితే ఇంతవరకు వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించని మంత్రి సమైక్య ర్యాలీ చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి విధానాలు, తీరును యావగించుకున్న ప్రజలు పల్లెల్లోకి రానీయకుండా తిరగబడతారనే ఉద్దేశంతో ఉద్యమాలతో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై మమకారం ఉంటే ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేపట్టాలని కోరారు.