గోరంట్ల : గోరంట్లకు చెందిన నిండు గర్భిణి అరుణకుమారి(20) అనుమానాస్పద స్థితిలో మరణించారు. కట్నం కోసం భర్తే హత్య చేశాడని హతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు, హతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు... నెల్లూరుకు చెందిన వట్టి శివశంకర్, సుజాత దంపతుల కుమార్తె అరుణకుమారిని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు గోరంట్ల ఆంజనేయకాలనీలో నివసిస్తున్నారు. అత్తమామలు జీవనోపాధి కోసం చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేయించారు. వారి సంసారం కొంతకాలం సజావుగా సాగినా, ఆ తరువాత కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అరుణ తల్లిదండ్రులు అల్లుడి కోరిక మేరకు స్కూటీని కొనిచ్చారు.
అయితే ఆమె గర్భిణి కావడంతో అడిగినంత కట్నం ఇస్తారని భావించి చిత్రహింసలు పెట్టడం తీవ్రం చేశాడని అరుణ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగిందని, అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఐదు నెలలు గర్భిణీ కావడంతో వాంతులు అధికం కావడంతో ఆస్పత్రికి తరలించామని స్థానికులను నమ్మించారని వారు ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ హసీనా సుల్తానా ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. భర్త శ్రీనివాసులను స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి గురువారం రాత్రి గోరంట్లకు చేరుకుని విచారణ చేపట్టారు.
గర్భిణీ అనుమానాస్పద మృతి
Published Thu, Sep 15 2016 11:56 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement
Advertisement