పవర్‌తోనే పరుగు | this is how heritage foods runs successfully | Sakshi
Sakshi News home page

పవర్‌తోనే పరుగు

Published Thu, Oct 1 2015 1:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

పవర్‌తోనే పరుగు - Sakshi

పవర్‌తోనే పరుగు

- హెరిటేజ్ ఫుడ్స్‌ది కూడా చంద్రబాబు తీరే
- బాబుకు అధికారం ఉన్నపుడే కంపెనీకి లాభాలు
- అధికార పార్టీకి బాబు కొమ్ముకాసినా పర్వాలేదు
- ‘పవర్’ కట్ అయినప్పటి నుంచీ నష్టాల బాట
- మిగతా డెయిరీల్లో ఎక్కడా లేని ‘ట్రెండ్’ దీని సొంతం
- 1994లో లిస్టయినప్పటి నుంచీ ఇదే ‘పనితీరు’

 
అయితే అధికారం చేతిలో ఉండాలి! లేకుంటే అధికారం ఉన్నవారితో చేతులు కలపాలి!!.       
ఇదీ... తె లుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ఫిలాసఫీ. ఆ రెండూ లేకుంటే ఆయన లేరు.
అచ్చం చంద్రబాబు ఫిలాసఫీయే ఆయన వ్యవస్థాపకుడిగా ఏర్పాటు చేసి, తన కుటుంబానికి అప్పజెప్పిన హెరిటేజ్ ఫుడ్స్‌ది కూడా. ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్ కాస్త బాగుండాలంటే చంద్ర బాబుకు అధికారం ఉండాలి. ఆ కంపెనీకి కాస్త మంచి లాభాలు రావాలంటే చంద్రబాబునాయుడి పార్టీ అధికారంలో ఉండాలి. లేకపోతే అధికారంలో ఉన్న పార్టీతో చంద్రబాబు చేతులు కలిపైనా ఉండాలి. ఈ రెండూ లేకుంటే మాత్రం... హెరిటేజ్‌కు లాభాలు రావు.

నిజంగా ఒక కంపెనీకి లాభాలు రావాలంటే అధికారంతో ఏం సంబంధం? డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్‌కు అధికారం ఉన్నపుడే లాభాలు ఎందుకొస్తున్నాయి? పోనీ.. ఈ రంగంలో ఉన్న మిగతా కంపెనీలు కూడా ఇలాగే పనిచేస్తున్నాయా? మరి ఇతర కంపెనీలు వేటికీ లేని పరిస్థితులు హెరిటేజ్‌కే ఎందుకున్నాయి? ఒకసారి చూద్దాం...
 
 చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకుడిగా హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసింది 1992లో. నిజానికి అప్పటికి ఆయనేమీ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కాదు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయటంతో పాటు... తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 1994లో అధికారంలోకి వచ్చీ రావటంతోనే చంద్రబాబు తన కంపెనీ పబ్లిక్ ఇష్యూకు తెర తీశారు. అప్పటికది చాలా చిన్న కంపెనీ. పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.10 కోట్లు సమీకరించారు. ఇక అప్పటి నుంచి తన కంపెనీకి పన్ను రాయితీలివ్వటం, సహకార రంగంలో పోటీగా ఉన్న చిత్తూరు డెయిరీ వంటి డెయిరీలను బొందపెట్టడం ప్రారంభించారు. మరోవంక వాటి స్థానంలో హెరి టేజ్‌ను విస్తరిస్తూ వచ్చారు. ఫలితం... 2000లో రూ.6 కోట్లుగా ఉన్న కంపెనీ లాభం 2004-05లో అధికారం పోయే సమయానికి ఏకంగా రూ.17 కోట్లకు చేరుకుంది.

అధికారంతో పాటు లాభాలూ...
చిత్రమేంటంటే చంద్రబాబుకు 2004లో అధికారం పోయింది. హెరిటేజ్ ఫుడ్స్‌కూ పవర్ పోయినట్లుంది. అప్పటి నుంచి క్రమంగా లాభాలు తగ్గటం మొదల య్యాయి. 2005లో రూ.10 కోట్లకు తగ్గిన లాభాలు... 2007లో రూ.1.7 కోట్లకు మాత్రమే పరిమితమయింది. ఇంకా చిత్రమేంటంటే ఆ తరవాత నుంచి కంపెనీ నష్టాల్లోకి పడిపోయింది. 2009లో రూ.794 కోట్లపై ఏకంగా రూ.35 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన ఈ కంపెనీ... 2012-13 వరకూ అంతంతమాత్రపు ఫలితాలనే ప్రకటించింది. 2012-13లో కూడా రూ.1,393 కోట్ల అమ్మకాలపై రూ.9.3 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించగలిగింది.

అయితే 2013 నుంచీ మళ్లీ కంపెనీ దశ తిరిగిపోయింది. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలోని కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయి మైనారిటీలో పడిన ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం కూడా పెట్టకుండా కాపాడుతూ వచ్చారు. చాలా వ్యవహారాల్లో చంద్రబాబు అనుకున్నట్టే జరిగిందని వార్తలూ అప్పట్లో వెలువడ్డాయి. వీటన్నిటి ఫలితమో ఏమోగానీ 2013- 14 నుంచి హెరిటేజ్ ఫుడ్స్ దశ తిరిగింది. ఆ సంవత్సరంలో రూ.1,650 కోట్ల అమ్మకాలపై రూ.49 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసిన కంపెనీ... ఈ సంవత్సరం చంద్రబాబు అధికారంలో ఉండటంతో గతేడాది ఫలితాలనే దాదాపు రిపీట్ చేసింది. 2014-15లోనూ రూ.45 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

మిగతా కంపెనీల మాటేంటి?
డెయిరీ పరిశ్రమలో సహకార రంగంలోని కంపెనీలే ఆధిపత్యం వహిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన అమూల్, కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ల వాటా చాలా అధికం. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ డెయిరీ సమాఖ్యలే అగ్రస్థానంలో ఉన్నాయి. రైతులే వాటాదార్లు కనక ఇవేవీ లిస్టెడ్ కంపెనీలు కావు. పెపైచ్చు వీటి లాభాల మార్జిన్లూ తక్కువే. అందుకే ప్రైవేటు రంగంలోని లిస్టెడ్ డెయిరీలతో హెరిటేజ్‌ను పోలిస్తే దాదాపు ఇంతే పరిమాణంలో ఉన్న హట్సన్ డెయిరీ, చిన్న కంపెనీగా ఆరంభమై ఎదిగిన క్వాలిటీ డెయిరీ గురించి చెప్పుకోవాలి. వీటికీ పరిమిత లాభాలు... ఒకోసారి నష్టాలూ వచ్చినా... అవేవీ అధికారాన్ని అనుసరించి లేవు.

2000వ సంవత్సరం నుంచి చూస్తే వరసగా నాలుగేళ్లు నష్టాలు ప్రకటించిన క్వాలిటీ డెయిరీ... ఆ తరవాత నుంచి లాభాలను నమోదు చేస్తూ వస్తోంది. ఈ లాభాలు కూడా 2004-05లో రూ.2 కోట్ల నుంచి మొదలై 2014కు వచ్చేసరికి ఏకంగా రూ.126 కోట్లకు చేరాయి. సంస్థ అమ్మకాలు కూడా ఏటికేడాది పెరుగుతూనే వచ్చాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్‌లా పాల వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిపెట్టిన హట్సన్ డెయిరీ పరిస్థితి కూడా ఇలాంటిదే. 2000 నుంచి 2003 వరకూ రూ.2 కోట్లలోపే నికరలాభం ప్రకటించిన ఈ కంపెనీ... తరవాత మెల్లగా అమ్మకాలతోపాటు లాభాలూ పెంచుకుంటూ వచ్చింది.

విస్తరణపై దృష్టిపెట్టడంతో ఖర్చులు ఎక్కువై లాభాలు ఒకో ఏడాది పెరగటం, ఒకో ఏడాది తగ్గటం వంటివి జరిగినా అవేవీ అధికారంతో సంబంధం ఉన్నట్టుగా కనిపించవు. ఎందుకంటే వరుసగా ఐదారేళ్లు తగ్గటం, మరో ఐదేళ్లు పెరగటం వంటివి జరగలేదు. కాకపోతే 2010 నుంచీ సంస్థ చక్కని వృద్ధిని ప్రకటిస్తూ 2014-15లో ఏకంగా రూ.81 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. మరి హెరిటేజ్ ఫుడ్స్ ఒక్క విషయంలోనే అధికారంతో ముడిపడిన లాభాలున్నా యనేది... చంద్రబాబుకే ఎరుక!!
 
డెయిరీ విశేషాలు..

  • కేవలం పాల ఉత్పత్తుల వ్యాపారం చేసే సంస్థల్లో సహకార రంగంలోని గుజరాత్ సహకార సమాఖ్య (అమూల్) పెద్దది. దీని టర్నోవర్ రూ.20,000 కోట్లు
  • 2014-15లో హెరిటేజ్ ఫుడ్స్ వార్షిక టర్నోవర్ రూ.2,072 కోట్లుకాగా, ఇందులో డెయిరీ వ్యాపారం ద్వారా రూ.1555 కోట్ల టర్నోవర్ సమకూరింది. మిగిలింది రిటైల్, అగ్రి ఫుడ్స్, బేకరీ, విద్యుత్ వ్యాపా రాల ద్వారా వచ్చింది.
  • హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.903 కోట్లు. ఇది కంపెనీ టర్నోవర్‌తో పోలిస్తే సగానికన్నా తక్కువ.
  • లిస్టెడ్ డెయిరీ కంపెనీల్లో నెస్లే, బ్రిటానియా వంటి బహుళజాతి సంస్థలతో పాటు దేశీ కంపెనీలు వడిలాల్, క్వాలిటీ, హట్సన్ ఉన్నాయి. వీటిలో క్వాలిటీ మార్కెట్ క్యాప్ రూ.1,583 కోట్లు వుంది. హట్సన్ మార్కెట్ విలువ మాత్రం రూ.4,320 కోట్లు.
  •  
  • రెండెకరాల కథ చెప్పరేం?

చంద్రబాబు ఎప్పుడు ఆస్తుల లెక్క చెప్పినా... 1988లో తమ కుటుంబానికి 77 ఎకరాలుండేదని, దాన్ని కుటుంబీకులంతా పంచుకున్నామని చెబుతారు. కానీ బాబు తొలిసారి ఎమ్మెల్యే అయింది 1978లో. మంత్రి అయిందీ అప్పుడే! అప్పటికి ఆయన తండ్రి ఖర్జూర నాయుడికి నారా వారి పల్లెలో ఉన్న ఆస్తి అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మ పసుపు కుంకుమగా తెచ్చుకున్న భూమి రెండెకరాలు.  మొత్తం రెండున్నర ఎకరాలు. కానీ 1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్ వేశారు.

దానికి జవాబుగా బాబు అఫిడవిట్ వేస్తూ... ‘‘నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏటా రూ.36,000 ఆర్జించా’’ అని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992-93 నాటికి హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. 1999లో తన ఆస్తుల్ని స్పీకరుకు ప్రకటిస్తూ... తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. అప్పట్లో హెరిటేజ్ ఫుడ్స్ భారీ నష్టాలు నమోదు చేసినా బాబు ఆస్తి అంతలా ఎలా పెరిగింది? 2004 నాటికి 20 కోట్లకు... 2009 నాటికి ఏకంగా 60 కోట్లకు తన ఆస్తులు చేరినట్లు బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పారు. అది కూడా ఆయన కొన్న విలువల ప్రకారం. మార్కెట్ విలువ చూస్తే 30 రెట్లు ఎక్కువే. మరి ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు అంత డబ్బెలా సంపా దించారు?

ఆరంభం నుంచే ఇన్వెస్టర్లకు టోపీ..
హెరిటేజ్ ఫుడ్స్ ఆరంభం కూడా దాని వ్యవస్థాపక అధిపతి చంద్రబాబు నాయుడి అబద్ధాలతోనే జరిగింది. 1994లో దీన్ని పబ్లిక్ ఇష్యూకు తెస్తూ... ఆయన సెబీ ఎదుట ప్రాస్పెక్టస్ దాఖలు చేశారు. దాన్లో... తాను అప్పటి దాకా ఏ వ్యాపారం చేయలేదని, హెరిటేజ్ తప్ప మరో వ్యాపారం లేదని చెప్పారు. కానీ 1983లోనే ఆయన ‘భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయ్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ కెమికల్స్’ అనే రెండు సంస్థల్ని ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేక అవి పూర్తి వ్యాపార కార్యకలాపాలు ఆరంభించకముందే మూతపడ్డాయి. వాటిపేరిట రుణాలు తీసుకుని... చెల్లించకుండా ఎగ్గొట్టారు కూడా. ఇవన్నీ దాచి ప్రాస్పెక్టస్ దాఖలు చేయటమంటే ఇన్వెస్టర్లను ఒక రకంగా మోసం చేయటమే. ఒకవేళ ఆరోజే నిజాలు చెప్పి ఉంటే ఈ చరిత్ర చూసి ఇన్వెస్టర్లు ఎందుకు ముందుకొచ్చి ఉండేవారనేది సందేహమే!!.

హెరిటేజ్‌కు దోచిపెట్టడం షురూ..

  • 1992లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో  పాలపొడి తయారు చేసే కంపెనీగా హెరిటేజ్ కథ మొదలైంది. అంతలోనే చంద్రబాబు రెవెన్యూ మంత్రి కావటంతో దీని దశ తిరిగింది. ఆ జిల్లాలో పలు డెయిరీలు మూత పడగా... హెరిటేజ్ మాత్రం బలపడింది. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి, విశాఖ జిల్లా బయ్యవరంలో పాల శీతలీకరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశాక... 2009-10 నాటికి దీని టర్నోవర్ రూ.900 కోట్లకు చేరింది.
  • 1995లో బాబు సీఎం అవుతూనే ట్యాక్స్ డిఫర్‌మెంట్ స్కీమ్ అమల్లోకి తెచ్చారు. 21.11.1995న నార్కెట్‌పల్లిలోని హెరిటేజ్ చిల్లింగ్ ప్లాంట్‌కు పన్ను మినహాయింపు వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చారు.
  • 1996 మేలో విశాఖ బయ్యవరం ప్లాంటుకు, 1997 మార్చిలో చిత్తూరు జిల్లా కాశిపెంట్ల ప్లాంటుకు అమ్మకం పన్ను రాయితీ కోసం దరఖాస్తు చేయగా... నె ల్లోనే ఓకే అనేశారు. ఈ మూడింటికీ కలిగిన లబ్ధి రూ.15 కోట్లు.
  • 14 ఏళ్ల వ్యవధిలో రూ.15 కోట్లు మినహాయిం చుకోవటానికి అనుమతి పొందిన బాబు...  ఆ సొమ్మును అతివేగంగా రాబట్టుకోవటానికి తాజా పాలపై ఉన్న 6 శాతం పన్నును 1995 ఏప్రిల్ 1న 10 శాతానికి పెంచారు. 2000 జనవరి 1న దీన్ని 12 శాతానికి పెంచారు. అంత పెంచాల్సిన అవసరం లేదని, తమ చేతికి రావాల్సిన రూ.15 కోట్లూ వచ్చేశాయని హెరిటేజ్ ెఅధికారులు సెలవిచ్చారో ఏమో కానీ... నెల తిరిగేసరికల్లా... అంటే 2000వ సంవత్సరం జనవరి 31న సీఎం హోదాలో పాలమీద మొత్తం పన్నునే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
  • అమ్మకం పన్నుకు బాబు 14 ఏళ్లు గడువు తీసుకున్నా 1999వ మార్చికల్లా రూ.15 కోట్లు చేతికి వచ్చేశాయి. అందుకే పాలపై పన్నును 2000లో రద్దు చేసేశారు.

ఈ 15 కోట్లను వ్యాపార విస్తరణకు వెచ్చించకుండా హెరిటేజ్ కేవలం బ్యాంకులోనే డిపాజిట్ చేసినా... అప్పటి వడ్డీ 18 శాతంతో 14 సంవత్సరాలకు ఇది ఏకంగా రూ.152 కోట్లకు చేరేది. నెలకు రూపాయి వడ్డీ చొప్పున వార్షిక వడ్డీ రేటు 12 శాతాన్ని పరిగణన లోకి తీసుకున్నా దాని విలువ 14 ఏళ్ల తరవాత రూ.73 కోట్లు. - ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించ కుండా మరో 14 ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు కనక మొత్తం వడ్డీ రూ.200 కోట్లకు పైమాటే. అదీ... బాబు మాస్టర్ ప్లాన్ ఫలితంగా హెరిటేజ్‌కు కలిగిన లబ్ధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement