క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం
♦ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని స్పష్టీకరణ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు, ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలు భవిష్యత్‌లో ఉండవని, ఇదే ఆఖరి అవకాశం అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బోయిన్‌పల్లిలోని కూరగాయల రిటైల్ మార్కెట్ గుండా కోజా ముస్లిం గ్రేవ్ యార్డుకు వెళ్లే దారి వివాదం నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలను డబ్బులు వసూలు చేయాలన్న భావనతో కాకుండా పేదలకు న్యాయం జరిగేలా వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, ఈ నేపథ్యంలో ఆయా పథకాల ద్వారా క్రమబద్ధీకరణ కోసం పేదల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆక్రమణలతోనే తంటా
ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని తలసాని తెలిపారు. ఇందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. 1.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా మొత్తం 425 యూనిట్లలో రెండు విడతలుగా చేపట్టిన కార్యక్రమాల్లో గుర్తించిన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు రూ.200 కోట్లతో వివిధ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్‌లో నాలాలు, రోడ్లు ఆక్రమణలకు గురికావడం అభివృద్ధికి ఆటంకంగా మారిందని తలసాని అన్నారు. వీలైనంత వరకు ఆయా స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నాలు చేస్తామని, అదే సమయంలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూమ్ స్కీము ద్వారా పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు.