మోసం తప్పా మేలేమి చేశారు!
- ఆయకట్టు రద్దుపై నోరు మెదపరెందుకు?
- ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా?
- మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం
ఆత్మకూరు (రాప్తాడు) : అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ప్రజలను టీడీపీ ప్రజాప్రతినిధులు మోసగించడమే తప్పా చేసిన మేలేమీ లేదని, ముఖ్యంగా పరిటాల సునీత మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత మూడు విడతల జన్మభూమి అర్జీలను పరిష్కరించలేని మంత్రి సునీత.. నాల్గో విడత సభల్లో ప్రజలు తనను నిలదీయకుండా ఉండేందుకు విపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరుస కరువులతో రైతులు, కూలీలు వలసలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలోనూ దాదాపు వంద కుటుంబాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయాయని, ఇది మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. నియోజకవర్గంలోని 20 వేల మంది యువతకు మొండి చేయి చూపారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే వెయ్యి మంది రేషన్‌డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఆదర్శ రైతులు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లను అన్యాయంగా తొలగించారని వివరించారు. రైతాంగ సమస్యలపై మంత్రికి ఏ మాత్రమూ అవగాహన లేదని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న ఆమె ప్రజలకు ఎలా మేలు చేయగలరని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 15వేల ఇన్‌పుట్ సబ్సిడీ, సంపూర్ణ రుణమాఫీ, హంద్రీనీవా ద్వారా 74 వేల ఎకరాలకు నీటినిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం వంటి రైతుల డిమాండ్లపై మంత్రి ఎక్కడా నోరు మెదపడం లేదన్నారు.
‘హెచ్చెల్సీ నుంచి దాదాపు 15 టీఎంసీల నీరు ప్రతి ఏటా మనకు రాకపోయినా... దాని గురించి మీరు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ కర్ణాటక ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ 15 టీఎంసీల నీటిని అప్పర్‡భద్ర కాలువ ద్వారా హంద్రీనీవా ఎగువన ఉన్న బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని చెరువులకు చేర్చే అవకాశం ఉన్నప్పటికీ మీరెందుకు ప్రయత్నం చేయరు’ అని మంత్రిని ప్రశ్నించారు. జీఓ నంబర్ 22 ద్వారా డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసినా, కుప్పంకు నీటిని తరలించడానికి రాప్తాడు ప్రాంత ఆయకట్టును ఫణంగా పెట్టినా మంత్రి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. 40 టీఎంసీలకు హంద్రీ- నీవా సామర్థ్యం పెంచి నీటిని కుప్పంకు తీసుకెళ్తే అర్థం ఉంది కానీ.. నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసి, తద్వారా మిగులు నీటిని తరలించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.