తొర్రిగడ్డ.. అవినీతికి అడ్డా..
తొర్రిగడ్డ.. అవినీతికి అడ్డా..
Published Mon, Jul 10 2017 11:01 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
–టీడీపీ అనుయాయులకు కాలువ పనులు
–రూ.2.30 కోట్లు కేటాయిస్తే లక్షల్లోనే వ్యయం
-మెటల్‌కు బదులు ఎర్రమట్టి వాడకం
-సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువగా బెడ్ కాంక్రీట్
సీతానగరం (రాజానగరం) : రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించిన తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం కాలువ పనులలో నాణ్యతలో తీసికట్టుగా ఉంది. కేటాయించిన నిధులు కోట్లలో ఉంటే ఖర్చు పెట్టినది లక్షలలో మాత్రమే. మిగిలిన సొమ్ము ఏమైందో ఏలిన వారికే ఎరుక. అనుయాయుల స్వలాభం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనులను వారికే కట్టబెట్టడంతో వారు లాభాలు మినహా నాణ్యత గురించి పట్టించుకోవడం లేదు. మరో వారం రోజులలో నీటిని విడుదల చేయవలసి ఉండగా ఇంత వరకూ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అరకొర నిర్మాణంతోనే నీటిని విడుదల చేస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉంది.
పురుషోత్తపట్నంలోని తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.2.30 కోట్లతో పనులు ప్రారంభించారు. 2.285 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన కాలువకు రూ 1.40 కోట్లు, కిలోమీటరు పొడవు గల కుడి కాలువకు రూ.70 లక్షలు కేటాయించారు. కాలువలో పూడిక తీసి గ్రావెల్ వేసి, ఆపై బెడ్ కాంక్రీట్ వేయాలి.
అయితే కాలువ పనులలో నాణ్యత లేకుండా చేశారు. కాలువలో మట్టి తీసిన అనంతరం గ్రావెల్ వేసి, దానిని వాటరింగ్ చేయాల్సి ఉంది. ఆపై 20 ఎంఎం నుంచి 40 ఎంఎం మెటల్ వేసి బెడ్ కాంక్రీట్ వేసి, దానికి ఇరువైపులా భూమిలోకి వాల్ కట్టవలసి ఉంది. అయితే కాలువ పనులలో ఎర్ర మట్టి వేసి చేతులు దులుపుకొన్నారు. కారు చౌకగా వస్తుందని రామచంద్రపురంలోని కొండ వద్ద నుంచి తెచ్చి వేసిన ఎర్రమట్టి కొద్దిపాటి వర్షానికే బురదగా మారిపోతోంది. బెడ్ కాంక్రీట్ పనులకు ఉపయోగించే సిమెంట్, ఇసుకలో కూడా సరైన విధానం పాటించలేదు. సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువగా వేసి పనులు పూర్తి చేశారు. బెడ్ కాంక్రీట్ వేసిన అనంతరం భూమిలోకి ఇరువైపులా కట్టవలసిన గోడను కట్టకుండానే మమ అనిపించారు. ప్రధాన కాలువ, కుడి కాలువ పనులు పూర్తి చేశామని కాంట్రాక్టర్ చెబుతున్నా, ప్రధాన కాలువలో, అలాగే కుడి కాలువలో కూడా కొన్ని ప్రాంతాలలో పనులు చేయకుండా వదిలేశారు. దీనితో ఖరీఫ్‌కు నీటి విడుదలలో ఆటంకం కలిగే అవకాశం ఉంది. అధికారులుపనులు పూర్తి చేసినట్లుగానే రికార్డులలో చూపి నీటిని విడుదల చేస్తారేమో చూడాల్సిందే మరి!
కేటాయింపు కోట్లలో, ఖర్చు లక్షల్లోనే..
కాలువ పనులకు రూ 2.30 కోట్లు కేటాయించినా కాంట్రాక్టర్ పూర్తి చేశామని అంటున్న అరకొర పనులకు అతి తక్కువ ఖర్చు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాలువలో వేసిన బెడ్ కాంక్రీట్‌కు కేవలం రూ.70 లక్షలు అయినట్లుగా సమాచారం. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతుందోనని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండో పంటకు నీరు నిలిపివేత!
గత ఏడాది కాలువ పనులను దృష్టిలో ఉంచుకుని, రెండో పంట మొక్కజొన్నకు నీటిని నిలిపివేశారు. దీనితో మొక్కజొన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది కాలువ పనులు చేస్తారని ఆశించిన రైతులకు చుక్కెదురైంది. కాలువలో అరకొర పనులతో సరిపెట్టారు. వచ్చే ఏడాది లైనింగ్ పనులు అంటూ కాలువ నుంచి నీటిని ఆపివేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులనుచూస్తే హడావిడి ఎక్కువ చేతలు తక్కువ అన్న చందాన ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ డీఈ, ఏఈఈల వివరణకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
పనుల్లో అవినీతి..
తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ పనులు నాణ్యతలోపంతో జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. అవినీతి రాజ్యమేలింది. కాలువ పనులకు కోట్లాది రూపాయలు కేటాయించి, లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మమ అనింపిచారు. దీని వలన ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ పనుల వలన ఉపయోగం లేదు.
– పెదపాటి రమేష్‌బాబు (డాక్టర్‌బాబు), వైఎస్సార్‌సీపీ సీతానగరం మండల కన్వీనర్
Advertisement
Advertisement