బామ్మను బెదిరించి బంగారం చోరీ
బామ్మను బెదిరించి బంగారం చోరీ
Published Thu, Sep 22 2016 2:04 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM
తణుకు : ఇంటికి వచ్చి ఏం బామ్మా బాగున్నావా.. అంటూ ఆత్మీయంగా పలకరించాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆమె గుర్తు పట్టకపోవడంతో అతనిలో దుర్బుద్ధి పుట్టింది. దీంతో ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభిం చిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను తణుకు సీఐ చింతా రాంబాబు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన వృద్ధురాలు గండమని అప్పలనర్సమ్మ స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపం సమీపంలో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు సమీప బంధువైన అరిగెల వెంకటేష్ తణుకులో కారు ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మే 8న అప్పలనర్సమ్మ ఇంటికి వెళ్లిన వెంకటేష్ ఆమెను బాగున్నావా అంటూ పలకరించి తనను పరిచయం చేసుకోబోయాడు. ఆమె గుర్తుకు రావడం లేదని చెప్పడంతో తన వద్ద ఉన్న చేతిరుమాలును ఆమె గొంతుకేసి చుట్టి చంపేస్తానని బెదిరించి.. తొమ్మిది కాసుల విలువైన బంగారు గాజులు, నానుతాడు ఎత్తుకెళ్లాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం పెరవలి వై.జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అతనిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీధర్, రామకృష్ణ, కానిస్టేబుళ్లు గణేష్, నాగేశ్వరరావు, శరత్, సురేష్‌ను సీఐ రాంబాబు అభినందించారు.
Advertisement