
యువకుడి మృతి కేసులో నిందితుల అరెస్ట్
బ్రహ్మసముద్రం : యువకుడి మృతి కేసులో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివప్రసాద్, బ్రహ్మసముద్రం ఎస్‌ఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, గంగరామన్నగారి తిప్పేస్వామి, కండక్టర్ రాజశేఖర్ ముగ్గురు మంచి స్నేహితులు. ఈ నెల ఆరో తేదీన ముగ్గురూ గ్రామ సమీపంలోని జమ్మికట్ట వద్ద కూర్చుని మద్యం తాగుతున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన పుట్టప్పగారి లక్ష్మీపతి (29) అక్కడకు వచ్చాడు. ఇతనికీ కొంత మద్యం పోశారు.
ఆ తర్వాత మరికొంత కావాలంటూ డిమాండ్ చేయడంతో బోయ రామకృష్ణ కోపోద్రిక్తుడై లక్ష్మీపతి మర్మావయవాలపై తన్నాడు. స్పృహతప్పి పడిపోయిన అతడిని చనిపోయాడని భావించి, ఈ నేరం తమపైకి రాకుండా ఉండేందుకు అందరూ కలిసి మెడకు లుంగీతో బిగించి, చెట్టుకు వేలాడదీసి పరారయ్యారు. ముగ్గురు నిందితులూ మంగళవారం ఆర్‌ఐ విజయకుమార్ వద్ద లొంగిపోయారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.