రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కర్నూలు శివారులోని వెంకటరమణ కాలనీ మలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
– మృతుల్లో ఒకరికి వచ్చే నెలలో పెళ్లి
– ముగ్గురుకి తీవ్ర గాయాలు
- కర్నూలు వెంకటరమణ కాలనీ మలుపు వద్ద దుర్ఘటన
కర్నూలు : కర్నూలు శివారులోని వెంకటరమణ కాలనీ మలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్యాలకుర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి(28), భరత్‌రెడ్డి(28), గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి(30) ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా, డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన రమణారెడ్డి, కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన గోపాల్‌రెడ్డితో పాటు టాటా ఏసీ పార్సిల్ సర్వీస్ డ్రైవర్ మహావీర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురితో పాటు గాయాలకు గురైన గోపాల్‌రెడ్డి, రమణారెడ్డిలు సమీప బంధువులు. కేఎ 53 ఎంబి 1307 కారులో ఆదివారం ఉదయం గోనెగండ్ల మండలం వేముగోడుకు వెళ్లి అక్కడ కౌలుకు భూమి తీసుకునేందుకు రైతులతో మాట్లాడి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఏరువాక పున్నమి కరీ పండుగ సందర్భంగా రాత్రి ప్యాలకుర్తి గోడౌన్ దగ్గర డిన్నర్ ముగించుకుని కర్నూలుకు బయలుదేరారు. రాత్రి 1:30 గంటల సమయంలో వెంకటరమణ కాలనీ మలుపు వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. హైదరబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న పార్సిల్ సర్వీసు టాటా ఏసీ కేఏ 01 ఏఈ 3907 వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పార్సిల్ సర్వీసు వాహనం డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయాలకు గురయ్యారు. రెండు వాహనాలు కూడా రోడ్డుకు ఇరువైపులా బోల్తా పడి నుజ్జునుజ్జు అయ్యాయి.
వచ్చేనెలలో పెళ్లి..
శ్రీనివాసరెడ్డి ఎంబీఏ, భరత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు డిగ్రీ వరకు చదువుకున్నారు. శ్రీనివాసరెడ్డికి దేవనకొండ మండలం మాసాపురంలో పెళ్లి నిశ్చయమయ్యింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో వివాహం జరిపించేందుకు కోడుమూరులో కళ్యాణ మండపం కూడా ఖరారు చేసుకున్నారు. కర్నూలులోని బాలాజీనగర్‌లో నివాసముంటూ చోల మండలం ఫైనాన్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డి భార్య సుస్మిత, కూతురు సాయి అశ్రితతో కలసి సంతోష్‌నగర్‌లో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. భరత్‌రెడ్డి బాలాజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే నాలుగో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు.
మృతదేహాలను మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మార్చురీ కేంద్రానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగో పట్టణ సీఐ నాగరాజరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిరణ్ కేసు నమోదు చేసుకుని ప్రమాద సంఘటన పూర్వాపరాలపై దర్యాప్తు చేస్తున్నారు.