తెల్లారిన బతుకులు | three dies of road accident | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Sat, Mar 11 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

వారంతా కళాకారులు...ఊరూరూ తిరుగుతూ భజనలు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. ఎన్‌పీకుంట మండలం గొల్లపల్లిలో జరిగిన  ఓ వర్ధంతి కార్యక్రమంలో భజన చేసేందుకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
– లారీ, ఆటో ఢీ - ముగ్గురి దుర్మరణం
– మరో పది మందికి తీవ్ర గాయాలు
– మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా వాసులు


కదిరి టౌన్‌ \ తనకల్లు : వర్ధంతి కార్యక్రమం కోసం వచ్చిన భజన బృందం తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. తెల్లారేసరికల్లా ఇంటికి చేరుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మార్గమధ్యంలోనే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. బృందంలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో పది మంది గాయపడి ఆస్పత్రిపాలయ్యారు.

    చిత్తూరు జిల్లా పీటీఎం మండలం శ్రీనివాసరాయునిపల్లెకు చెందిన భజన కళాకారుల బృందం అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పెడపల్లి సమీపంలో గల గొల్లపల్లిలో గల సమీప బంధువు వర్ధంతికి నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఆటోలో గురువారం రాత్రి వచ్చారు. రాత్రి భజన అయిపోయాక తెల్లవారుజామున 3 గంటలకు అదే ఆటోలో స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలోని తనకల్లు మండలం చీకటిమానిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. ఘటనలో   ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి(45) అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

స్థానికుల సాయంతో మిగిలిన క్షతగాత్రులను వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ(66) మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న రత్నమ్మ(60)ను మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.  ఆటో డ్రైవర్‌ నరసింహులు, శంకరప్ప, పార్వతమ్మ, లక్ష్మీదేవమ్మ, రెడ్డెమ్మ, నారాయణమ్మ, రాయప్ప, ఈశ్వరప్ప, లావణ్య, వెంకటరమణ గాయపడ్డారు. వారిలో నారాయణమ్మ, రెడ్డెమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలించారు.

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా పొట్ట కూటి కోసం భజనలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మృతుల్లో కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణకు కూడా భార్య లక్ష్మీదేవి, ఇద్దరు సంతానం. రెడ్డెమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement