బెజ్జూర్ అడవుల్లో పులి సంచారం
బెజ్జూర్: కుమ్రం భీం జిల్లా బెజ్జూర్ మండలం గుండపెల్లి అటవీ ప్రాంతాల్లో ప్రధాన రోడ్డుపై కెమెరాకు పులి చిక్కింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులి జాడను తెలుసుకోవడానికి ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత జనవరి నెల 29న బెజ్జూర్ అటవీ ప్రాంతంలోని చిన్నసిద్ధాపూర్ శివారు ప్రాంతంలోని స్ప్రింగ్ ఆనకట్ట వద్ద నిఘా కెమెరాకు పెద్ద పులి నీరు తాగుతూ కనిపించింది. అదే నెల 30వ తేదీ సాయంత్రం స్ప్రింగ్ ఆనకట్ట ప్రాంతంలో మరో పులి కెమెరాకు చిక్కింది. దీంతో బెజ్జూర్ అడవుల్లో పెద్ద పులుల సంచారం ఎక్కువైంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పులులను వేటగాళ్ల బారిన పడకుండా వాటిని రక్షించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.