పేద విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యం
ఏలూరు సిటీ : ‘జిల్లా విద్యారంగాన్ని గాడిలో పెట్టి పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు బేస్‌మెంట్ తరహా పరీక్షలు పెట్టాం తప్ప సొంత అజెండా కానీ, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనా కాని లేదు’ అని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక డీఈవో కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయటంతోనే గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చేపట్టిన సర్వేలో 6వ తరగతి విద్యార్థులకు సైతం అక్షరాలు, కూడికలు రాని పరిస్థితి ఉందని తేలిందని, దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
నాణ్యమైన విద్య అందించాలని.. విద్యార్థుల కనీస అభ్యసనా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,14,590 మందికి కామన్ పరీక్ష నిర్వహిస్తే వారిలో 72,717 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 36.54 శాతం విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని గుర్తించామన్నారు. మొత్తంగా సీ, డీ గ్రేడుల్లో 58 శాతం మంది విద్యార్థులు ఉన్నారని వీరి కోసమే బేస్‌మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బడిగంటల కార్యక్రమం ద్వారా పాఠశాలల్లోని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ బడుల బలోపేతానికి..
పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే, ప్రై వేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని డీఈవో తెలిపారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించి, ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని డీఈవో చెప్పారు. గత పదేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 1.70 లక్షల మంది పిల్లలు ప్రై వేట్ పాఠశాలలకు Ðð ళ్లిపోయారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 10 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 113 వరకూ ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు బలహీనం కాకూడదనే సంకల్పంతోనే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండటంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని డీఈవో మధుసూదనరావు వివరించారు.