శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
► పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి
►పోలీసులకు వైద్య పరీక్షలు
గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సాయుధ దళ పోలీసుల సమీకరణలో భాగంగా 12 రోజుల శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది. గోదావరిఖని పోలీస్ హెడ్‌క్వార్టర్ ప్రాంగణంలో అన్యువల్ మొబలైజేషన్ ను పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి ప్రారంభించారు. శిక్షణకు హాజరైన పోలీసులనుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ శిక్షణను సద్వినియోగపర్చుకుని సుశిక్షుతులు కావాలని సూచించారు. వెపన్ డ్రిల్, పరేడ్, వ్యాయామం, యోగా తదితర శిక్షణలో మెలకువలు నేర్చుకోవాలన్నారు. అనంతరం పోలీసులకు వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, బెల్లంపల్లి ఆర్‌ఐ సుందర్‌రావు, ఆర్‌ఎస్సైలు రజనీకాంత్, మధుకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, అంజన్న, సంతోష్‌కుమార్, సురేశ్ పాల్గొన్నారు.
అవస్థలు పడుతున్న పోలీస్ సిబ్బంది
గోదావరిఖని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో శుక్రవారం నుంచి 12రోజుల పాటు జరగనున్న అన్యూవల్ మొబలైజేషన్ శిక్షణకు 200 మంది పోలీసులు హాజరవుతున్నారు. ప్రతీరోజు ప్రాక్టికల్స్, థియరీలో ఉదయం 6నుంచి 8 గంటల వరకు, 10 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4నుంచి 5.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెడ్ క్వార్టర్‌లో ఉండడానికి పోలీస్ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత చాలా మందిని కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి బదిలీచేశారు. అయితే ఈ శిక్షణ కోసం 70కిలోమీటర్ల దూరం నుంచి తెల్లవారుజామున ఆ గంటల వరకే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాలంటే వారు ఉదయం నాలుగు గంటలకే బయలుదేరాల్సి వస్తున్నది. తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు శిక్షణ ఉంటుండడంతో ఓపిక లేక నీరసించి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. స్థానికంగా బస చేయడానికి గానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి గానీ సరైన వసతులు లేకపోవడంతో కూడా పోలీసులు సిబ్బంది అవస్థల పాలవుతున్నారు.