union
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
Published Sun, Jul 24 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
మార్కాపురం : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి బీవీ రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల పోస్టాఫీసులు పనిచేస్తుండగా పట్టణ ప్రాంతాల్లో 24 వేల పోస్టాఫీసులు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే సిబ్బంది రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేస్తున్నారని, వారికి నెలకు రూ.6 నుంచి రూ.10 వేలు మాత్రమే జీతం ఇవ్వడం అన్యాయమన్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే పోస్టల్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్, ఇతర సౌకర్యాలు, గ్రామాల్లోని ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ తదితర పథకాలు పోస్టాఫీసుల్లో అమలు చేస్తుండటంతో తపాలాశాఖకు ఆదాయం చేకూరుతోందన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి ఆర్‌ఐసీటీ (రూల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పథకం కింద గ్రామీణ ప్రాంత పోస్టాఫీసులను కంప్యూటరీకరణ చేసి విద్యుత్, రెవెన్యూ, నీటి పన్ను తదితర బిల్లులను పోస్టాఫీసుల్లో చెల్లించే సౌకర్యం గ్రామీణులకు అందుబాటులో రానుందన్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసులన్నింటినీ పేమెంట్ బ్యాంకులుగా మార్చి బ్యాంకు సేవలు కూడా అందించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. గ్రామీణ తపాలా వ్యవస్థను పరిశీలించి ఉద్యోగుల సమస్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్రతో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని పేర్కొన్నారు. ఆ కమిటీపై ఒత్తిడి తెచ్చి గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా పాదయాత్ర చేస్తామని బీవీ రావు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.మర్రెడ్డి, పట్టణ బ్రాంచి కార్యదర్శి నారాయణరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు సీహెచ్‌వీవీ సత్యనారాయణ, సయ్యద్ ఖాశిం పాల్గొన్నారు.
Advertisement
Advertisement