నేడు సెలవు.. రేపు దరువు
Published Sat, Nov 19 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పొరుగు జిల్లాలో జరిగే సన్మానం కోసమని మన జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏకంగా 2 వేల స్కూల్ బస్సులను రాజమండ్రి తరలిస్తున్నారు. ఇటీవల దోమలపై దండయాత్ర పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు వచ్చిన సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన విష యం విదితమే. తాజాగా.. స్కూల్ బస్సుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించటం వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి కూడా జనాన్ని తరలించేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్ని ఇవ్వాలంటూ జిల్లా విద్యా శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఆ సంస్థల యాజమాన్యాలకు మౌఖిక ఆదేశాలిచ్చారు. బస్సుల్ని సీఎం సన్మాన సభకు వినియోగిస్తున్న కారణంగా ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించాలని, ఇందుకు బదులుగా సెలవు రోజైన ఆదివారం నాడు తరగతులు నిర్వహించుకోవాలని ఆదేశించారు.
ఏమిటీ దారుణం!
ఓ సామాజిక వర్గమంతా తమ వెంటే ఉందని చూపించుకునే కార్యక్రమంలో భాగంగానే సీఎం చంద్రబాబు సన్మానం ఏర్పాటు చేయించుకున్నారని, ఈ సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేసే బా«ధ్యతను సైతం ఆయనే తన భుజాలకు ఎత్తుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిష¯ŒS చైర్మ¯ŒSగా నియమితులు కాగా, ఆ నియామకం తగదంటూ హైకోర్టు నుంచి అభిశంసన ఎదుర్కొన్న కారెం శివాజీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి సన్మానాలు చేయించుకుంటే తప్పులేదని, సభల పేరుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటం ఎంతవరకూ సమంజసమని పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తుంటే.. పాఠశాలలకు ఇష్టారాజ్యంగా సెలవులు ప్రకటించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇదిలావుండగా, సర్కారు తీరుపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం గుర్రుగా ఉన్నాయి. రవాణా శాఖ, జిల్లా విద్యా శాఖ అధికారులు బెదిరించి మరీ పాఠశాలల్ని మూయించివేయడం ఏమిటని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్లు అడిగినట్టుగా బస్సులు ఇవ్వకుంటే తమను లక్ష్యంగా చేసుకుని వేధిస్తారని, లేనిపోని నిబంధనలతో తమ బస్సుల్ని రోడ్డుపై తిప్పకుండా చేస్తారని పేరు చెప్పేందుకు ఇష్టపడని విద్యాసంస్థల యజమాని ఒకరు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,250కి పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉంటే.. వాటి ఆధ్వర్యంలో సుమారు 2,300 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 2 వేల బస్సుల్ని తరలిస్తే.. విద్యార్థుల్ని తీసుకొచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఆదివారం రోజున ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తే.. వాటిని మూయించివేస్తామని, విధిగా నిబంధనలు పాటించి తీరాలని చెప్పే విద్యా శాఖ అధికారులు సీఎం సభ నిమిత్తం శనివారం సెలవు ఇచ్చి, ఆదివారం తరగతులు జరుపుకోవాలని ఆదేశిం చడం హాస్యాస్పదంగా ఉందని యాజ మాన్యాలు అంటున్నాయి. శనివారం స్కూళ్లకు సెలవు ఇచ్చి.. ఆదివారం తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలని పలువురు వాపోతున్నారు. ఇంతకీ ఎవరు ఆదేశిస్తే.. స్కూళ్లకు సెలవు ఇచ్చారు, ఎవరు అడిగితే స్కూల్ బస్సులను రాజమండ్రి తరలిస్తున్నారన్న ప్రశ్నలకు విద్యా శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అబ్బే.. సెలవు ఆదేశాలివ్వలేదు
ప్రైవేటు స్కూళ్లకు శనివారం సెలవు ఇవ్వాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఎవరైనా సీఎం సభకు బస్సులు పంపిస్తే.. దానిమూలంగా పిల్లలను స్కూళ్లకు తీసుకురావటంలో ఇబ్బంది వస్తే సెలవు ఇచ్చుకోవచ్చు. అనధికార సెలవుకు బదులు ఆదివారం పాఠశాల నిర్వహించుకునే అవకాశం కల్పించాం. దీనిపై అధికారికంగా ఆదేశాలేమీ జారీ చేయలేదు. – డి.మధుసూదనరావు, డీఈవో
Advertisement