విద్యాసంస్థల నిర్లక్ష్యం అపరిమితం!
Published Tue, Feb 14 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ఏలూరు అర్బన్ : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్ ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా పిల్లల రక్షణకు సరియైన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు అనుమతించిన పరిమితి నిబంధనను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా విద్యార్థులకు ప్రమాదం కలిగిస్తున్నా సంబంధిత ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతుండడం విమర్శలకు తావిస్తోంది.
గత చేదు అనుభవాలు
l గతంలో పెదవేగి మండలంలోని ఒక విద్యా సంస్థ కేవలం 45 మంది విద్యార్థులను తరలించేందుకు అనుమతి ఉన్న బస్‌లో ఏకంగా 130 మంది చిన్నారులను తరలించేది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చింది.
l గత యేడాది నగరానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఇదే విధంగా తమ కాలేజీలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులను పరిమితికి తరలించేవారు. కేవలం 36 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్న వ్యాన్‌లో వందమందికి పైగా విద్యార్థులను తరలించడం గుర్తించిన నాటి ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు బస్‌ను ఆపివేశారు. అందులో ఉన్న విద్యార్థులను లెక్కించగా ఏకంగా నూట ఐదుగురు ఉన్నారు. డీఎస్పీ నిర్ఘాంతపోయారంటే పరిస్థితి ఎంద ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
l స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న ప్రముఖ పాఠశాల బస్‌లో ఇదేవిధంగా అపరిమితంగా విద్యార్థులను ఎక్కించడంతో డ్రైవర్‌కు స్టీరింగ్ సైతం తిప్పే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు.
l జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యాసంస్థ బస్‌లో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో బోల్తా కొట్టడంతో 27 మంది పిల్లలకు గాయాలయ్యాయి.
ఇవిగో నిబంధనలు
విద్యార్థులను తరలించే బస్‌లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ జీవో 35లో స్పష్టంగా ఉందని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్‌ఎస్ మూర్తి ఇలా వివరించారు.
l ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్ధులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉండాలి. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆ బాక్స్‌లో ఉండాల్సిన మందుల పరికరాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై 30 రోజులకు ఒకసారి పరీక్షించాలి.
l బస్‌లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి.
l బస్ బోల్తా కొడితే అందులో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి.
l చిన్నారులు కిటికీల గుండా తలలు, చేతులు బయటపెట్టేందుకు ఆవకాశం లేకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలి.
l సీనియర్ డ్రైవర్‌లను నియమించాలి. అదే సమయంలో వారి నుంచి ఫిజికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వయసు మళ్లిన వారిని డ్రైవర్‌లుగా నియమించకూడదు.
l చిన్నారులు బస్‌లోకి ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా బస్ ఫుట్‌బోర్డు మొదటి మెట్టు నేల నుంచి 325 మి.మీల ఎత్తులో అమర్చాలి.
l అన్ని బస్‌లలో అటెండర్లు ఉండాలి. వారు పిల్లలు దిగే సమయంలో లోపలికి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా సహకరించాలి
l విద్యార్థులు తమ స్కూలు బ్యాగులను పెట్టుకునేందుకు లగేజీ స్థలం ఉండాలి. ఈ నిబంధనలను పాటించని బస్‌ల విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మూర్తి హెచ్చరించారు.
Advertisement