ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత విద్యా సంవత్సరం మార్చి చివర్లో మూతపడ్డ విద్యాసంస్థలు 7నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఏయే తరగతుల విద్యార్థులు ఎప్పటినుంచి హాజరు కావాలనేది స్పష్టం చేస్తూ సమగ్ర మార్గదర్శకాలతో షెడ్యూళ్లు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం విద్యాసంస్థల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు వేర్వేరుగా అకడమిక్ క్యాలెండర్లను ప్రకటించింది.
పని దినాలను సర్దుబాటు చేస్తూ..
2020–21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు 5 నెలల కాలం వృథా అయ్యింది. ఈ దృష్ట్యా కోల్పోయిన పని దినాలను సర్దుబాటు చేసుకుంటూ సోమవారం నుంచి దశలవారీగా తరగతులను ప్రారంభిస్తున్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఏప్రిల్ 30 వరకు, డిగ్రీ, పీజీ తరగతులను ఆగస్టు వరకు కొనసాగించేలా అకడమిక్ క్యాలెండర్లను ప్రభుత్వం జారీ చేసింది. సిలబస్‌ను కుదించకుండా నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా ముఖ్యమైన అంశాలన్నీ బోధించేవిధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్‌గా విభజించి తరగతి గదిలో నేరుగా టీచర్లు బోధన చేస్తారు. విద్యార్థులు ఇంటివద్ద నేర్చుకొనేవి, ఆన్‌లైన్ ద్వారా బోధించేవి అనే విధానాల్లోనూ బోధన చేయనున్నారు.
ఏయే తరగతులు ఎప్పటినుంచి..
అన్ని యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లోని 9, 10, 12 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నవంబర్ 23 నుంచి అన్ని పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులు మొదలవుతాయి. డిసెంబర్ 14 నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 5 క్లాసులు, నవంబర్ 16 నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయి. నవంబర్ నెలంతా బడులు ఒంటిపూట (ఉదయం 9 నుంచి 1.30 వరకు) మాత్రమే ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలి. రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో తరగతుల నిర్వహణపై హెడ్మాస్టర్లు షెడ్యూల్ రూపొందిస్తారు. డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రాఫెషనల్ కోర్సులకు సంబంధించి ఫస్టియర్ మినహా తక్కిన తరగతులు నవంబర్ 2 నుంచి దశల వారీగా ప్రారంభమవుతాయి. ఆ కాలేజీల్లో ఫస్టియర్ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment