– నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
- హాజరుకానున్న 70,726 మంది విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు కొనసాగుతాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 70,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 35,981 మంది, ద్వితీయ సంవత్సరం 34,745 మంది ఉన్నారు. మొత్తం 96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రోజూ ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఫర్నీచర్, తాగునీరు, వెలుతురు ఉండేలా చూస్తున్నారు. కళాశాల విద్యా కమిషనర్ ఉదయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క విద్యార్థీ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ) వెంకటేశులు స్పష్టం చేశారు. సెల్ఫ్ కేంద్రాలైన తలుపుల, తనకల్లు, అమడగూరు, నార్పల, తాడిపత్రి, తాడిమర్రి సెంటర్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో తాడిపత్రి, నార్పల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదు సిట్టింగ్, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. అలాగే డీఈసీ మెంబర్లు, హైపవర్ కమిటీ సభ్యులు పరీక్షలను పర్యవేక్షిస్తారు.
పరీక్షా కేంద్రాలుండే పాఠశాలల వేళల మార్పు
పరీక్ష కేంద్రాలు ఉండే ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల వేళలు మార్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంటర్ పరీక్ష ముగిసన అనంతరం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆదేశించారు. మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నడపాలన్నారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
విజయీభవ
Published Wed, Mar 1 2017 12:34 AM | Last Updated on Wed, Sep 26 2018 3:27 PM
Advertisement
Advertisement