బంగరు భవితకు రెండు చుక్కలు!
– జిల్లా వ్యాప్తంగా నేడు ‘పల్స్ పోలియో’
– రేపు, మర్నాడు ఇంటింటా సిబ్బంది సర్వే
– ప్రోగ్రాం ఆఫీసర్లతో జాయింట్ డైరెక్టర్ సమీక్ష
వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక ఇలా..
జిల్లా జనాభా : 42,99,541
లక్ష్యం (0–5 ఏళ్లలోపు చిన్నారులు) : 4,50,545
గ్రామీణ ప్రాంతాల్లోని పోలియో బూత్‌లు : 3246
పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూత్‌లు : 421
పల్స్ పోలియోలో పాల్గొనే సిబ్బంది : 14,684
రూట్ సూపర్‌వైజర్లు : 376
మొబైల్ బృందాలు : 96
హై రిస్క్ ప్రాంతాలు : 267
సరఫరా చేసిన వ్యాక్సిన్లు : 6 లక్షలు
ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమం : ఏప్రిల్ 3,4 తేదీలు
నేటి బాలలే రేపటి పౌరులు..బాలల బంగరు భవితకు రెండు చుక్కలు తప్పనిసరి. చిన్నారులు అంగవైకల్యం.. అనారోగ్యం బారిన పడుకుండా పుట్టిన నాటి నుంచి నిర్ణీత సమయంలో పలు రకాల వ్యాక్సిన్లు వేయించాలి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల వ్యాక్సిన్లు ఉచితంగా అందజేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ‘పల్స్‌పోలియో’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. చిన్నారుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని రెండు పోలియో చుక్కలు వేయిస్తే వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసినవారవుతారని వైద్యులు, వైద్య నిపుణులు చెప్తున్నారు.
- అనంతపురం మెడికల్
నిర్లక్ష్యం చేస్తే శాపమే
0-5 ఏళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ రెండు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, మేయర్ స్వరూప కోరారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శనివారం అనంతపురంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు తప్పకుండా వేయించాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఇప్పటికే వ్యాక్సిన్లు అందజేసినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. అనంతపురంలోని బుడ్డప్పనగర్‌లో ఉన్న రాజేంద్ర మునిసిపల్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓలు డాక్టర్ పద్మావతి, డీఐఓ డాక్టర్ పురుషోత్తం, డీసీటీఓ డాక్టర్ సుధీర్‌బాబు, డీఎంఓ డాక్టర్ దోసారెడ్డి, ఎస్‌ఎంఓ డాక్టర్ పవన్‌కుమార్, పీఓడీటీటీ డాక్టర్ సుజాత, డెమో హరిలీలాకుమారి, డిప్యూటీ డెమోలు నాగరాజు, ఉమాపతి, డిప్యూటీ హెచ్‌ఈఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓతో జేడీ సమీక్ష
పల్స్‌పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వీణాకుమారి శనివారం సాయంత్రం డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణతో ఆయన చాంబర్‌లో సమావేశం అయ్యారు. ప్రోగ్రాం ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి చిన్నారికీ చుక్కలు వేయించాలని ఆదేశించారు.